దళిత బంధుపై ఆశలు
ABN , First Publish Date - 2022-11-21T00:36:00+05:30 IST
దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఉద్దేశంతో ప్రభుత్వం ‘దళితబంధు’ పథకం ప్రవేశపెట్టింది.
- వ్యాపార రంగంలోకి దళితబంధు నిధులు
- డిసెంబరులో నియోజకవర్గానికి 500 యూనిట్లు
- జిల్లాలో తొలి విడత 206 మంది ఎంపిక
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఉద్దేశంతో ప్రభుత్వం ‘దళితబంధు’ పథకం ప్రవేశపెట్టింది. జిల్లాలో మొదటి విడతలో 206 మంది లబ్ధిపొందారు. రెండో విడత కోసం లబ్ధిదారుల ఎంపికకు ప్రభు త్వాలు ఆదేశాలు జారీ చేయడంతో దళితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన దళితబంధు పథకాన్ని ప్రభుత్వం అన్ని జిల్లాలకు విస్తరించింది. తొలివిడతలో నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలతోపాటు జిల్లాలో ఉన్న మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేశన్నపల్లె, వెల్జీపూర్, చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం దుబ్బపల్లి హామ్లెట్ గ్రామం వర్ధవెల్లిలో 206 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 206 యూనిట్లకు సంబంధించి రూ.20.60 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఆర్థికంగా బలోపేతం అయ్యే దిశగా వ్యాపార రంగాల వైపు మళ్లించే విధంగా చర్యలు చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాలు జారీ చేయడంతో మళ్లీ ప్రభుత్వ పథకాలను ముందుకుతీసుకొచ్చారు. దళిత బంధు పథకంలో మళ్లీ నియోజకవర్గానికి 500 యూనిట్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ మేరకు డిసెంబరులో 500 మంది ఎంపిక చేసి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను, మోబైల్ యాప్‌ను కూడా ప్రారంభించి మానిటరింగ్ చేయనున్నారు. దళిత బంధు యూనిట్లు మళ్లీ రానుండడంతో దళిత కుటుంబాల్లో అనందం వ్యక్తం అవుతోంది.
వ్యాపార రంగాలవైపు దళిత కుటుంబాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో అందించిన 206 యూనిట్లతో దళిత కుటుంబాలు దళితబంధును సద్వినియోగం చేసుకుంటున్నాయి. వ్యాపార రంగాల వైపు అడుగులు వేస్తున్నాయి తొలి విడతలో జిల్లాలోని ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో 14 మంది, వీర్నపల్లి మండలం రంగంపేట 17, ఎల్లారెడ్డిపేట మండలం పదిర 18, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట 30, గంభీరావుపేట మండలం మల్లుపల్లె 21, ఇల్లంతకుంట మండలం కేశన్నపల్లె 18, వెల్జీపూర్ ఒకరు, బోయినపల్లి మండలం దుబ్బపల్లి హామ్లేట్ గ్రామం వర్ధవెల్లి 17, చందుర్తి మండలం 12, కోనరావుపేట 12, రుద్రంగి 6, వేములవాడ అర్బన్ 15, వేములవాడ రూరల్ 10, వేములవాడ మున్సిపాలిటీలో 15 మందిని ఎంపిక చేశారు. వంద శాతం సబ్సిడీతో రూ.10 లక్షల చొప్పున రూ.20.60 కోట్లు దళితబంధు ఖాతాల్లో జమ చేశారు. దళితబంధును పూర్తి స్తాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వాహనాలు అందించడం కంటే వ్యాపారాలను నెలకొల్పే దిశగా శిక్షణ అందించే ఏర్పాట్లను చేశారు. 206 యూనిట్లలో వెటర్నరీ రంగంలో 49 యూనిట్లు, పరిశ్రమల రంగంలో 46 యూనిట్లు, ఇతర రంగాల్లో 110 యూనిట్లను లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో ఫ్లోర్‌మిల్, మోబైల్ రైస్‌మిల్, దాల్‌మిల్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోల్ బంక్, ఫిష్ కల్చర్, కాంక్రీట్ మిల్లర్, సిమెంట్ బ్రిక్స్, రైస్‌మిల్, రైస్‌డిపో, మెడికల్ షాపు, ఫోటో స్టూడియో, ఎలక్ర్టానిక్ గూడ్స్ షోరూం సూపర్ మార్కెట్ వంటి పరిశ్రమలను ఎంపిక చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడత గ్రౌండింగ్‌ను పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధంగా ఉన్నారు.
దళితబంధుతో ఉన్నత స్థితి
- కలెక్టర్ అనురాగ్ జయంతి
దళితబంధు పథకంతో పేదరికంలో ఉన్న దళిత కుటుంబాలు మెరుగైన అదాయం పొంది ఉన్నత స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక లబ్ధిదారుడికి రూ.10 లక్షలను అందిస్తోంది. లబ్ధి పొందే కుటుంబంలోని మహిళ పేరుతోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. పూర్తిగా గ్రాంట్ రూపంలో ఇస్తుంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. జిల్లాలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనం మేరకు లబ్ధిదారులకు లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసి వారిని ప్రోత్సహిస్తున్నాం. యూనిట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని జీవన అవసరాలకు వినియోగించు కుంటున్నారు. పొదుపు కూడా చేస్తున్నారు.