హై టెన్షన్‌

ABN , First Publish Date - 2022-11-28T01:39:13+05:30 IST

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఆదివారం హైటెన్షన్‌ చోటుచేసుకుంది.

హై టెన్షన్‌
వాహనంలో నుంచే పోలీసులతో మాట్లాడుతున్న బండి సంజయ్‌

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అడ్డుకున్న పోలీసులు

- వెంకటాపూర్‌ వద్ద బండి సంజయ్‌ వాహనాన్ని తిప్పి పంపించిన పోలీసులు

జగిత్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఆదివారం హైటెన్షన్‌ చోటుచేసుకుంది. ప్రజా సంగ్రామ యాత్రను నిర్మల్‌ జిల్లా అడెల్లి పోచమ్మ వద్ద పూజలు నిర్వహించి ప్రారంభించడానికి కరీంనగర్‌లోని తన నివాసం నుంచి బయలు దేరిన బండి సంజయ్‌ను జగిత్యాల జిల్లాలో అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల రూరల్‌ మండలం తాటిపల్లి వద్ద జాతీయ రహదారిపై సంజయ్‌ వాహనాన్ని డీఎస్పీ ప్రకాశ్‌ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలోని ఓ బీజేపీ కార్యకర్త నివాసంలో బండి సంజయ్‌ కొద్దిసేపు ఆగి టీ తాగారు. అదే సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు. పరిస్థితిని గమనించిన బీజేపీ కార్యకర్తలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు. తాటిపల్లి వద్ద పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాటిపల్లి గ్రామ జాతీయ రహదారిపై బీజేపీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేశారు.

ఫ పోలీసుల కన్నుగప్పి..

జిల్లాలోని తాటిపల్లి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడి నుంచి బండి సంజయ్‌ ప్రత్యేక వాహనంలో నిర్మల్‌ వైపు బయలు దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు తాటిపల్లి గ్రామం నుంచి మేడిపల్లి మండల కేంద్రం, కోరుట్ల మండలం మోహన్‌ రావు పేట, వెంకటాపూర్‌ వరకు సంజయ్‌ వాహనాన్ని అనుసరించారు. అప్పటికే కోరుట్ల శివారులోని వెంకటాపూర్‌ వద్ద ముందస్తుగా మోహరించిన పోలీసులు అబండి సంజయ్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. బండి సంజయ్‌ వాహనం దిగి కొద్ది సేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య కొద్దిగా తోపులాట జరిగింది. అనంతరం పోలీసులతో మాట్లాడిన బండి సంజయ్‌ తన వాహనంలో కరీంనగర్‌కు తిరిగివెళ్లారు.

ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల రూరల్‌ మండలం తాటిపల్లి, కోరుట్ల మండలం మోహన్‌రావుపేట, వెంకటాపూర్‌, కోరుట్లల, జగిత్యాల రూరల్‌ మండలం దరూర్‌ వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

లోక్‌ సభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తా

- రాష్ట్ర బీజేపీ చీప్‌, కరీంనగర్‌ ఎంపీ సంజయ్‌

మల్యాల, నవంబరు 27: జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకారణంగా పోలీసులు తనను అడ్డుకోవడం, బీజేపీ కార్యకర్తలపై ఇష్టారీతిగా వ్యవహరించిన సంఘటనలపై లోక్‌ సభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా వెంకటాపూర్‌ వద్ద తన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్న అనంతరం కరీంనగర్‌కు తిరిగి వెళ్తున్న క్రమంలో మల్యాల క్రాస్‌ రోడ్డు వద్ద బీజేపీ శ్రేణులు చేస్తున్న నిరసన కార్యక్రమం వద్ద కొద్దిసేపు వాహనం ఆగింది. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈసందర్బంగా పోలీసులకు, కార్యకర్తలకు మద్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో నూకపల్లి ఉప సర్పంచ్‌ సురేశ్‌ను ఓ పోలీసు అధికారి కాలితో నెట్టారు. అక్కడే ఉన్న ఎంపీ బండి సంజయ్‌ పోలీసుల తీరును అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఎంపీ సంజయ్‌ మాట్లాడారు. జిల్లాలో జరిగిన సంఘటనలపై లోక్‌ సభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ అధిష్టానం దృష్టికి సంఘటనను తీసుకవెళ్లి ఆదారాలతో సహా ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలు సహకరిస్తున్నప్పటికీ సీఐ కిషోర్‌ దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు.

Updated Date - 2022-11-28T01:39:14+05:30 IST