ఆన్‌లైన్‌లో ఆరోగ్య సమాచారం

ABN , First Publish Date - 2022-03-05T05:38:58+05:30 IST

రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుకు జిల్లాను ఎంపిక చేసిన ప్రభుత్వం శనివారం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సర్వం సన్నద్ధం చేసింది. 220 బృందాలు ఇంటింటి సర్వే చేపట్టనున్నాయి. సేకరించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందపర్చి డిజిటల్‌ ఐడీ కార్డులు అందజేయనున్నారు. ఆన్‌లైన్‌లో నిక్షిప్తమైన ఆరోగ్య వివరాలు సత్వర చికిత్సకు దోహదపడనున్నాయి.

ఆన్‌లైన్‌లో ఆరోగ్య సమాచారం
టీ-హబ్‌లో ఏర్పాటు చేసిన మిషన్లు

   - అందరికీ డిజిటల్‌ కార్డులు 

- సత్వర చికిత్సకు దోహదం

- సిరిసిల్ల టీ-హబ్‌లో పరీక్షలు 

- రక్త నమూనాల రవాణాకు 23 వాహనాలు 

- నేడు  ‘హెల్త్‌ ప్రొపైల్‌’ ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రి కే తారకరామారావు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రజల ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన  ‘హెల్త్‌ ప్రొపైల్‌’ కార్యక్రమం ఎట్టకేలకు ప్రారంభంకానుంది. గతేడాది జూన్‌ 8న  కేబినేట్‌ హెల్త్‌ ప్రొపైల్‌ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించి. ఇందుకోసం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసింది. వైద్య ఆరోగ్య శాఖ సమాచార సేకరణకు సమాయత్తమైనా కరోనా వ్యాప్తితో ఆలస్యమైంది. గత సంవత్సరం డిసెంబరులోనే ప్రారంభించాలని అనుకున్నా థర్డ్‌వేవ్‌, జాతరల కారణంగా వాయిదా పడింది. జనవరిలో ప్రయోగాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పూర్తిస్థాయిలో హెల్త్‌ ప్రొపైల్‌ సర్వే చేయాలని కార్యాచరణ రూపొందించారు. శనివారం వేములవాడ ఏరియా ఆస్పత్రిలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారికంగా హెల్త్‌ ప్రొపైల్‌ కార్యాక్రమాన్ని ప్రారంభించనున్నారు. హెల్త్‌ ప్రొపైల్‌తో ప్రజలకు చికిత్స అందించడంలో సత్వర చర్యలు చేపట్టే అవకాశం ఉంది. 


జిల్లాలో 220 బృందాలు 

హెల్త్‌ ప్రొపైల్‌ రూపకల్పన కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటింటి సర్వే కోసం 220 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక ఏఎన్‌ఎం, ఇద్దరు ఆశావర్కర్లు సభ్యులుగా ఉంటారు. మండల వైద్యాధికారి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 11  వరకు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారు. వీరికి రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బంది సహకరిస్తారు. ప్రతీ రోజు 10 ఇళ్లలో 30 నుంచి 40 మంది రక్తనమూనాలు సేకరిస్తారు. ఇందుకోసం యాప్‌లో సమాచారాన్ని ఎంట్రీ చేసేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.  45 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో బుధ, శని, ఆదివారాల్లో నమూనాల సేకరణలో మినహాయింపు ఉంటుంది. 


పరీక్షల్లో టీ-హబ్‌ కీలకం

హెల్త్‌ ప్రొపైల్‌ తయారీలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టీ -హబ్‌ కీలకంగా మారనుంది. జిల్లాలో సేకరించిన రక్త నమూనాలను ప్రతీ రోజు 23 వాహనాల ద్వారా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టీ-హబ్‌కు చేరుస్తారు. ఇక్కడ 58 రకాల ఆరోగ్య పరీక్షలను వైద్య సిబ్బంది సహకారంతో నిర్వహిస్తారు. సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా నిక్షిప్తం చేస్తారు. పరీక్షల కోసం ప్రత్యేకించి టీ-హబ్‌లో అద్దె ప్రతిపాదికన మిషన్లను కూడా ఏర్పాటు చేశారు. 27 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను నియమించారు. మూడు షిప్టులుగా పరీక్షలు జరుగుతాయి. 


జిల్లాలో 4.22 లక్షల మందికి పరీక్షలు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5.52 లక్షల జనాభా ఉండగా హెల్త్‌ ప్రొపైల్‌ కోసం 18 సంవత్సరాలు పైబడిన వారికి రక్త పరీక్షలు, ఇతర ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. జిల్లాలో 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 సబ్‌ సెంటర్లు, రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, జిల్లా ఆస్పత్రి, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 

ఆన్‌లైన్‌లో సమాచారం 

హెల్త్‌ ప్రొపైల్‌లో భాగంగా సేకరించిన సమాచారాన్ని పరీక్షల అనంతరం రిపోర్టులను వ్యక్తికి సంబంధించి అకౌంట్‌లను క్రియేట్‌ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. యూనిక్‌ ఐడీ నంబరు కేటాయించి డిజిటల్‌ హెల్త్‌ కార్డులను  జారీ చేస్తారు. ఏదైనా అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్తే ఐడీ నంబరు ఆధారంగా వైద్యులు గతంలో రోగి ఆరోగ్య సమస్యలు తెలుసుకునే వీలు కలుగుతుంది. దీని ద్వారా సత్వరం వైద్యం అందించే వీలు కలుగుతుంది.  

హరిదాస్‌నగర్‌లో ప్రయోగత్మకం 

రాజన్న సిరిసిల్ల జిల్లాను హెల్త్‌ ప్రొపైల్‌కు పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన తరువాత జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో డ్రైరన్‌ నిర్వహించారు. 30 బృందాలు జనవరి 4న ఇంటింటికి వెళ్లి 800 మంది రక్త నమూనాలను సేకరించాయి. సీబీపీ, ఎల్‌ఎఫ్‌టీ, ఆర్‌ఎఫ్‌టీ, తదితర 30 రకాల పరీక్షలు చేసి ఫలితాలను అందించారు. సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ, సాంకేతిక సమస్యలు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ, ఆధార్‌ లింక్‌తో ఫోన్‌నంబర్లకు మేసేజ్‌లు పంపించడం వంటివి విజయవంతమవడంతో  పూర్తిస్థాయి సర్వేకు సిద్ధమయ్యారు. 


వైద్యులకు శిక్షణ 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హెల్త్‌ ప్రొపైల్‌ కోసం శుక్రవారం ప్రాథమిక  ఆరోగ్య కేంద్రం వైద్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు మాట్లాడుతూ హెల్త్‌ ప్రొపైల్‌ కార్యక్రమాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు.    కార్యక్రమానికి  ప్రజాప్రతినిధులు సహకరించాలని,  విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వైద్యాధికారులతోపాటు ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలకు హెల్త్‌ ప్రొపైల్‌పై అవగాహన కల్పించారు.  సమావేశంలో ఎంహెచ్‌ఎన్‌ అధికారి డాక్టర్‌ కపిల సాయి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ మహేష్‌, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌, అర్‌బీఎస్‌కే డాక్టర్‌ రాజశేఖర్‌, ఎన్‌హెచ్‌ఎం అధికారి ఉమాదేవి, డీడీఎం కార్తీక్‌ పాల్గొన్నారు.

 సర్వం సన్నద్ధం

- డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు జిల్లా వైద్యాధికారి 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అరోగ్య వివరాల సేకరణకు హెల్త్‌ ప్రొపైల్‌ను రూపొందించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాను పైలట్‌ ప్రాజక్టుగా ఎంపిక చేసింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే హెల్త్‌ ప్రొపైల్‌ సర్వేకు సర్వం సన్నద్ధం చేశాం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చాం. డ్రైరన్‌ కూడా విజయవంతంగా ముగిసింది. జిల్లాలో 220 బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తాయి. ఇందుకోసం 18 సంవత్సరాలు పైబడిన 4.22 లక్షల మందిని గుర్తించాం. 



Updated Date - 2022-03-05T05:38:58+05:30 IST