-
-
Home » Telangana » Karimnagar » GST should be lifted on handloom and powerloom products-NGTS-Telangana
-
చేనేత, పవర్లూం ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి
ABN , First Publish Date - 2022-09-26T06:13:42+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత, పవర్లూం ఉత్పత్తులపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తి వేయాలని లాల్బావుట చేనేత, పవర్లూం కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు.

సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 25 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత, పవర్లూం ఉత్పత్తులపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తి వేయాలని లాల్బావుట చేనేత, పవర్లూం కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం చేనేత, పవర్లూం ఉత్పత్తులపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ సంఘం లాల్బావుట చేనేత, పవర్లూం కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పంతం రవి మాట్లాడుతూ చేనేత, పవర్లూం రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత, పవర్లూం ఉత్పత్తులపై 5 శాతం జీస్టీని విధించదని, జీస్టీ ఫలితంగా ఉత్పత్తి రంగంపై ఆధారపడిన అనేక మంది రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక మంది చేనేత, పవర్లూం రంగాలపై ఆధారపడి ఉన్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతనంగా విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చిందని, దీని ద్వారా సామాన్యులపై విద్యుత్ భారం మరింత పడనుందని అన్నారు. పరిశ్రమలు మూతపడి కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ ఈ ప్రాంత ప్రజలకు సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం, లాల్బావుట చేనేత, పవర్లూం కార్మిక సంఘం అధ్యక్షుడు ఒగ్గు గణేష్, గౌరవ అధ్యక్షుడు అజ్జె వేణు, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, తిరుపతి, కనకయ్య, సుదర్శన్, భాస్కర్ పాల్గొన్నారు.