రాజీవ్‌ స్వగృహ భూమికి సర్కార్‌ టెండర్‌

ABN , First Publish Date - 2022-01-29T05:13:41+05:30 IST

‘‘ప్రతి మధ్య తరగతి కుటుంబానికి స్వంత ఇల్లు ఉండాలన్నది.. మీ కలే కాదు.. ఈ ప్రభుత్వం సంకల్పం కూడా.. ఈ ధరలతో ఇల్లు కట్టుకోలేమని మీరు బెంగపడద్దు... ప్రభుత్వం మీకోసం రాజీవ్‌ స్వగృహ పథకంతో ముందుకు వస్తోంది.

రాజీవ్‌ స్వగృహ భూమికి సర్కార్‌ టెండర్‌
రాజీవ్‌ స్వగృహాల కోసం సేరించిన భూమి

- 540 కోట్ల భూమి అమ్మే ప్రయత్నాలు 

- ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 7,524 మంది  

- 2007లోనే రూ.3.76 కోట్ల డబ్బు చెల్లింపు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)


‘‘ప్రతి మధ్య తరగతి కుటుంబానికి స్వంత ఇల్లు ఉండాలన్నది.. మీ కలే కాదు.. ఈ ప్రభుత్వం సంకల్పం కూడా.. ఈ ధరలతో ఇల్లు కట్టుకోలేమని మీరు బెంగపడద్దు... ప్రభుత్వం మీకోసం రాజీవ్‌ స్వగృహ పథకంతో ముందుకు వస్తోంది. తరతరాలకు తరగని ఆస్తిని మీకు సమకూరుస్తుంది.. మీ స్వంతింటి కల సాకారం కావాలి.. అంటూ ’’ 2007లో ఆనాటి వైఎస్సాఆర్‌ సర్కార్‌ చేసిన ప్రచారాన్ని నమ్మి జిల్లాకు చెందిన 7,524 మంది తలా ఐదువేల రూపాయల చొప్పున సర్కార్‌కు డిపాజిట్‌ చేసి స్వంత ఇళ్ల కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలా వారు డిపాజిట్‌గా 5వేల రూపేణా 3 కోట్ల 76 లక్షల 20వేల రూపాయలు, దరఖాస్తు రూపేణా 18లక్షల 81వేల రూపాయలు సర్కార్‌కు చెల్లించుకున్నారు. ఈ సొమ్ము నుంచి 2 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం 90 ఎకరాల భూమిని రాజీవ్‌ స్వగృహ ఇళ్ల కోసం సేకరించింది. ఇప్పుడు ఆ భూమి విలువ కోట్లకు ఎగబాకింది. ఎకరాకు కనీస పక్షంగా 6 కోట్ల రూపాయాల చొప్పన 540 కోట్ల రూపాయలకు చేరింది. దీనితో ఇప్పుడు ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ పథకానికి తిలోదకాలిచ్చి ఎవరి డిపాజిట్‌ వారికి చెల్లిస్తాం.. దరఖాస్తు చేసుకోండి అంటూ ప్రకటన జారీ చేయడంతో మధ్యతరగతి ప్రజలందరూ లబోదిబో మంటూ కోర్టును ఆశ్రయించారు. 


రాజీవ్‌ స్వగృహ భూమికి డిమాండ్‌


2007లో ఆనాటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం మధ్యతరగతి, అల్పాదాయవర్గాల ప్రజలకు తక్కువ ధరల్లో స్వంత ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రాజీవ్‌ స్వగృహ పథకాన్ని చేపట్టింది. ఇందుకోసం మున్సిపాలిటీలలో ఉన్న ప్రజలు 3వేల రూపాయల చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ప్రజలు 5వేల రూపాయల చొప్పున 250 రూపాయల దరఖాస్తు రుసుముతో పాటు డిపాజిట్‌గా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పరిధిలో 7,524 మంది 5వేల రూపాయల చొప్పున 3కోట్ల 76 లక్షల 20వేల రూపాయలను ప్రభుత్వానికి డిపాజిట్‌ చేసి ప్రభుత్వం నిర్ణయించే సరసమైన ధరలకు స్వంత ఇల్లు కొనుక్కోనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ ద్వారా జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీ వద్ద 2 కోట్ల రూపాయలు వెచ్చించి 90 ఎకరాల భూమిని సేకరించింది. 7,524 మంది డిపాజిట్లు చెల్లించగా 7,487 దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని జీ+9 ఫ్లోర్లను 44 బ్లాకులుగా నిర్మించి ఇల్లు సమకూర్చాలని నిర్ణయించింది. 2008 సంవత్సరంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. 46 టవర్ల కోసం పునాదులు కూడా తవ్వి కొంత మేరకు పిల్లర్లు కూడా వేశారు. భూమిని చదును చేయడంతోపాటు వివిధ స్థాయిలో నిర్మాణ పనుల కోసం 10 కోట్ల రూపాయల వరకు వెచ్చించినట్లు సమాచారం. అయితే మార్కెట్‌ రేట్‌ కంటే కనీసం 25శాతం తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కరీంనగర్‌లో ఓపెన్‌మార్కెట్‌లో ఉన్న ధరల కంటే ఎక్కువ ధరను నిర్ణయించింది. దీనితో లబ్ధిదారులు అప్పుడు తమవంతు వాటాను చెల్లించేందుకు మీనమేషాలు లెక్కించారు. ఇలా రెండు సంవత్సరాలు కాలయాపన జరుగడంతో రాజీవ్‌ స్వగృహ ఇళ్ల నిర్మాణ పనులు పెండింగ్‌లో పడిపోయాయి. రాజీవ్‌ రహదారి వెంటే అభివృద్ధి వేగంగా జరుగడం, గ్రామాల అభివృద్ధి చెంది భూముల ధరలు కూడా పెరుగడంతో రాజీవ్‌ స్వగౄహ భూమికి కూడా ఊహించని విధంగా 300 రెట్లు ధర పెరిగింది. దీనితో ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆ భూమిపై పడింది. రాజీవ్‌ స్వగృహ కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ వారు చెల్లించిన డిపాజిట్‌ డబ్బు వాపసు ఇచ్చి బహిరంగ మార్కెట్‌లో 90 ఎకరాల స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు జనవరి 13న ఒక ప్రకటన జారీ చేస్తూ డిపాజిట్లు చెల్లించిన వారంతా తమతమ రశీదుల ఆధారాలను జతపరుస్తూ డబ్బువాపసు చేయమని దరఖాస్తు చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ లబ్ధిదారులు అంతకుముందు చేసుకున్న విన్నపాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. 


 మా డబ్బుతో కొన్న భూమి మాకే ఇవ్వాలి


జిల్లాలోని 7,524 మంది రాజీవ్‌ స్వగృహ దరఖాస్తుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాజీవ్‌ స్వగృహ ఆర్జీదారుల చారిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పడింది. ఈ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న ఈశ్వరయ్య కార్యవర్గంలోని కొందరు ప్రతినిధులు గత నవంబర్‌ 22న, 24న ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీని, రాజీవ్‌ స్వగృహ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను కలిసి తమ డబ్బుతో కొన్న భూమిని తమకే ఇవ్వాలని, భూమిని థర్డ్‌పార్టీ వ్యక్తులకు విక్రయించవద్దని వినతిపత్రం సమర్పించారు. అయితే ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగానీ, రాజీవ్‌స్వగృహ ఎండీ నుంచి కానీ సానుకూల స్పందన ఏమీ రాకపోగా లబ్ధిదారులు తమ డిపాజిట్లు వాపసు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలనే ప్రకటన వెలువడింది. ఇక్కడ 121 గజాల స్థలానికి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మేరకు ధర పలుకుతున్నది. దీనితో రాజీవ్‌ స్వగృహ భూమికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. తక్కువలో తక్కువ ఎకరాకు ఆరు కోట్ల చొప్పున ఈ భూమి విక్రయించినా 540 కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశమున్నందున ప్రభుత్వం ఇప్పుడు దీనిని అమ్మేయడానికే నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఐదేసి వేల రూపాయల డిపాజిట్‌ చేసి 14 సంవత్సరాల పాటు ఎదురుచూస్తూ వచ్చిన తమకు డబ్బులు వాపస్‌ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేయడం పట్ల దరఖాస్తుదారులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు నిర్మించి ఇవ్వకపోయినా స్థలమైనా కేటాయించాలని కోరుతున్నారు. దీనిపై దరఖాస్తుదారుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఈ నెల 27న హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఈ నెల 31న విచారణ చేపడతామని ప్రకటించినట్లు అసోసియేషన్‌ పేర్కొంది. కోర్టు ద్వారానైనా తమకు న్యాయం దక్కుతుందన్న ఆశాభావాన్ని దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు.  



 


Updated Date - 2022-01-29T05:13:41+05:30 IST