సర్కారు వారి బడి.. విద్యార్థుల సందడి

ABN , First Publish Date - 2022-07-06T05:48:21+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్ని హంగులు సమకూరుతుండడంతో తల్లిదండ్రులు కూడా విద్యార్థును సర్కారు బడుల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు.

సర్కారు వారి బడి.. విద్యార్థుల సందడి
సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి చేసిన గీతానగర్‌ పాఠశాల

- పెరుగుతున్న అడ్మిషన్లు

- ‘బడిబాట’కు అనూహ్య స్పందన 

- ప్రైవేటు పాఠశాలల నుంచి 5,223 మంది చేరిక 

- సీఎస్‌ఆర్‌ నిధులతో కొత్త హంగులు 

- ‘మన ఊరు, మన బస్తీ, మనబడి’కి 172 పాఠశాలల ఎంపిక 


(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్ని హంగులు సమకూరుతుండడంతో  తల్లిదండ్రులు కూడా విద్యార్థును సర్కారు బడుల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా సర్కారువారి బడిబాటకు ఇంగ్లీష్‌ మీడియం ఊతమిచ్చింది. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల చేరికకు బాట వేసింది. దీంతోపాటు ‘మన ఊరు-మన బడి, ’మన ఊరు- మన బస్తీ’ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలు కార్పొరేట్‌ సొబగులు అద్దుకున్నాయి. గంభీరావుపేటలో కేజీ టూ పీజీ వరకు పాఠశాల సిద్ధమైంది. అడ్మిషన్లు  కూడా ప్రారంభించారు.  మరోవైపు ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు, ఇతర పాఠశాలల నుంచి 5,223 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. బడిబాట సక్సెస్‌ అవడంతో ఉపాధ్యాయుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది. 

జిల్లాలో 49,766 మంది విద్యార్థులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 657 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో గత విద్యా సంవత్సరం 73,690 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 534 ప్రభుత్వ పాఠశాలల్లో  49,766  మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అధికంగా విద్యార్థులు ఉండగా ఈసారి 5,323 మంది అదనంగా చేరారు. ఒకటో తరగతిలో 3,666 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వారిలో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 2,791 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 518 మంది, నేరుగా 357 మంది, రెండో తరగతి నుంచి 7వ తరగతి వరకు 1557 మంది చేరారు. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ బోధన ప్రవేశపెట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతోపాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారు. విద్యార్థి ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు పాఠశాలలో చదువుకొని వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


ప్రైవేటు చుదువులు భారం 

జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారంగా మారాయి. కింది స్థాయి తరగతులకే ఫీజులు, ఇతర  చెల్లింపులు, పుస్తకాల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ.20 నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొవిడ్‌ కారణంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆర్థికంగా చితికిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఆంగ్లంలో బోధనతో ప్రభుత్వ పాఠశాలలే మెరుగు అనే పరిస్థితికి తల్లిదండ్రులు వచ్చినట్లు తెలుస్తోంది.  

‘మన ఊరు-మనబడి’కి 172 పాఠశాలలు 

 ‘మన ఊరు-మనబడి’లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 510 పాఠశాలల్లో మొదటి విడత 172 పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు.  ఇందులో 12 పాఠశాలలు సీఎస్‌ఆర్‌ నిధులతో తీర్చిదిద్దుతున్నారు. 160 పాఠశాలల్లో ‘మన ఊరు-మనబడి’ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. సీఎస్‌ఆర్‌ నిధులతో సిరిసిల్లలో ఇప్పటికే సిరిసిల్ల గీతానగర్‌ పాఠశాలను అభివృద్ధి చేశారు. గంభీరావుపేటలో కేజీ టూ పీజీ పాఠశాలను తీర్చిదిద్దారు. కోనరావుపేట మండలం మల్కపేటలో చల్మెడ జానకీ దేవి పేరుతో ప్రాథమిక పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటితోపాటు జిల్లాలోని అనేక పాఠశాలలకు రంగులు వేశారు. విద్యార్థులను ఆకర్షించే విధంగా మన సంస్కృతీసంప్రాదాయలకు అద్దంపట్టే విధంగా గోడలలను చిత్రాలతో అలంకరించారు. రాబోయే రోజుల్లో సర్కారు పాఠశాలలు కొత్త హంగులతో విద్యార్థులను మరింతగా ఆకర్షించనున్నాయి. 


Updated Date - 2022-07-06T05:48:21+05:30 IST