టీవీవీపీలోకి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి

ABN , First Publish Date - 2022-01-25T05:35:30+05:30 IST

జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి (సీహెచ్‌సీ) తెలంగాణ వైద్య విదాన్‌ పరిషత్‌ (టీవీవీపీ)లోకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీవీవీపీలోకి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి

 18 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు 

 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి 


జమ్మికుంట జనవరి 24: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి (సీహెచ్‌సీ) తెలంగాణ వైద్య విదాన్‌ పరిషత్‌ (టీవీవీపీ)లోకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తెలంగాణ వైద్య విదాన్‌ పరిషత్‌లోకి పూర్తిగా అప్‌గ్రేడ్‌ కానున్నట్లు తెలిసింది. ఐదు కోట్ల రుపాయాలు వెచ్చించి అత్యాధునిక  సౌకర్యాలతో నిర్మితమైన ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభమైనా.. అందులో పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో లేక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోతుంది. సరిపడ సిబ్బందిని మంజూరు చేస్తే నిరంతరం రోగులకు వైద్య సేవలు అందించే అవకాశాలు ఉన్నాయి. జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని టీవీవీపీలో విలీనం చేయాలని ప్రజలు పలుమార్లు అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చసింది. ఆసుపత్రి టీవీవీపీ పరిధిలోకి వెళితే 18 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు, 14 మంది స్టాఫ్‌ నర్స్‌లు పని చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో 24గంటలు వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వస్తాయి.


1988లో పీహెచ్‌సీగా ప్రారంభం


1988 సంవత్సరం అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వర్‌రావు జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆ సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉంది. తరువాత అర్బన్‌ ప్రైమరీ సెంటర్‌, తర్వాత 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్‌ చేశారు. పాత ఆసుపత్రి భవనం శిథిలవస్థకు చేరుకోవడంతో ఐదేళ్ల క్రితంఅప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నూతన ఆస్పత్రి భవన నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో భవన అందుబాటులోకి వచ్చినా వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ వైద్య విధాన్‌ పరిషత్‌లో కలపడం ద్వారా 18 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు, 14మంది స్టాఫ్‌ నర్స్‌లు అందుబాటులోకి వస్తారు.


Updated Date - 2022-01-25T05:35:30+05:30 IST