రామగుండంలో రూ.18కోట్ల నిధులకు గండం
ABN , First Publish Date - 2022-03-05T06:25:51+05:30 IST
రామగుండం నగరపాలక సంస్థ ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను సకాలంలో వినియోగించుకోలేకపోతున్నది.
- సకాలంలో వినియోగించుకోకపోవడమే కారణం
- ఖజానాలోనే ఎస్సీ సబ్‌ప్లాన్, పట్టణప్రగతి నిధులు
కోల్‌సిటీ, మార్చి 4: రామగుండం నగరపాలక సంస్థ ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను సకాలంలో వినియోగించుకోలేకపోతున్నది. దీంతో నగరపాలక సంస్థ ఖజానాలో ఉన్న రూ.18కోట్ల నిధులకు గండం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ సబ్‌ప్లాన్, పట్టణ ప్రగతి ద్వారా విడుదలైన రూ.18కోట్ల నిధులు ప్రస్తుతం ఖజానాలో ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన రూ.12కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఓపెన్ బ్యాలెన్స్‌గా ఉన్నాయి. ఖాజానాలో 001హెడ్ కింద ఎస్సీ సబ్‌ప్లాన్, పట్టణ ప్రగతి నిధులు ఉంటాయి. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి రూ.9కోట్లతో 46పనులకు గత ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు నిర్వహించారు. టెండర్లను రింగ్ చేయాలనే తపనతో 8నెలలు పొడిగించుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు డిసెంబర్లో వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఫిబ్రవరి వరకు అగ్రిమెంట్లు లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఇటీవలే అగ్రిమెంట్లు చేశారు. ఇంకా అంచనాలు, ఇతర పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం మార్చి 25వ తేది నాటికే నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అవి వెనక్కిపోతాయి. రామగుండం నగరపాలక సంస్థలో ఎస్సీ సబ్‌ప్లాన్‌లో కేటాయించిన 46 పనుల్లో ఇప్పటి వరకు కేవలం పది పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 36కుపైగా పనులు మొదలు కాలేదు. రూ.12కోట్లలో రూ.9కోట్ల పనులకు మాత్రమే టెండర్లు పిలిచారు. మిగిలిన రూ.3కోట్ల పనులకు టెండర్లు కూడా పిలువలేదు. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై తమపై వివక్ష చూపారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారి డివిజన్లలో రూ.90లక్షల పనులు పెట్టారు. ఆ పనులకు సంబంధించి ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ లేదు. ఇక మిగిలిన నిధులలో డివిజన్‌కు రూ.3లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. ఆ ప్రతిపాదనలు కూడా లేవు. అలాగే పట్టణ ప్రగతి నిధులతో పారిశుధ్య నిర్వహణ, సామగ్రి కొనుగోలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఇతర అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులు కూడా చేయకపోవడంతో రూ.6కోట్ల నిధులు ఖజానాలోనే ఉండిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం నిధుల వినియోగానికి ఇంకా 20రోజులు మాత్రమే గడవు ఉంది. 20రోజుల్లోగా పనులు పూర్తి చేసి బిల్లుల చెల్లింపులు జరుగకపోతే నిధులు వెనక్కి వెళ్లనున్నాయి. గతంలో ఎస్సీ సబ్‌ప్లాన్ వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రూ.3కోట్ల నిధులు వెనక్కి వెళాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి నిధులు లేని పరిస్థితి నెలకొన్నది. ఎట్టకేలకు ఆరు నెలల తరువాత నిధుల విడుదల అయ్యాయి. అవి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. రామగుండంలో కమీషన్ల బాగోతానికి విడుదలైన నిధులను వాపసు పోగొట్టే దుర్భర స్థితి నెలకొందనే ఆరోపణలు వస్తున్నాయి.