‘ఉపాధి’ బడ్జెట్‌కు కసరత్తు

ABN , First Publish Date - 2022-11-16T00:47:53+05:30 IST

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. గ్రామాల్లో వలసలు నివారిచండంతోపాటు వారికి పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం తీసు కొచ్చింది. దీని ద్వారా గ్రామాల్లోని కూలీలు వలస వెళ్లకుండా నియంత్రిస్తూ ఊళ్లోనే ఉపాధి కల్పించడానికి పనులు చేపడుతున్నారు.

 ‘ఉపాధి’ బడ్జెట్‌కు కసరత్తు


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. గ్రామాల్లో వలసలు నివారిచండంతోపాటు వారికి పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం తీసు కొచ్చింది. దీని ద్వారా గ్రామాల్లోని కూలీలు వలస వెళ్లకుండా నియంత్రిస్తూ ఊళ్లోనే ఉపాధి కల్పించడానికి పనులు చేపడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పనుల గుర్తింపుతోపాటు కూలీల బడ్జెట్‌ రూపకల్పనకు జిల్లాలో గ్రామసభలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహిస్తూ పనులను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 140 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. బోయినపల్లి మండలంలో 6 గ్రామాలు, చందుర్తి 7, ఇల్లంతకుంట 14, గంభీరావుపేట 6, కోనరావుపేట 20, ముస్తాబాద్‌ 16, రుద్రంగి 6, తంగళ్లపల్లి 14, వీర్నపల్లి 4, వేములవాడ 6, వేములవాడ రూరల్‌ 17, ఎల్లారెడ్డిపేటలో 24 గ్రామాల్లో సభలు నిర్వహించారు. వీటి పరిధిలో ఏ, బీ, డీ కేటగిరీల్లో 1256 పనులను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని గ్రామాల్లోనూ సభలు నిర్వహించనున్నారు. గ్రామం, మండలం, జిల్లా రాష్ట్ర స్థాయిలో బడ్జెట్‌ను రూపొందించి కేంద్రానికి నివేదికలు పంపించనున్నారు. గుర్తించిన పనుల ప్రకారం 2024 మార్చి 31 వరకు గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహించనున్నారు. గతంలో ఉపాధి పనులు ఇష్టానుసారంగా జరిగిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. సామాజిక తనిఖీలతోపాటు ఉపాధి పనులపై కేంద్రం పూర్తిగా నిఘాను పెంచింది. ఇప్పటికే నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ ఎన్‌ఐసీ సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధిహామీ కూలీలకు నేరుగా వారి ఖాతాల్లోనే కూలి జమ చేస్తుంది. ప్రస్తుత లేబర్‌ బడ్జెట్‌లో అధికా శాతం భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలువలు, కుంటలు, చెరువుల్లో పూడిక తీత, నీటి సంరక్షణ, ఫాంపాండ్‌లు, చేపల చెరువులు, వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పరిశ్రమ షెడ్‌ల నిర్మాణం, నర్సరీలు, పండ్లతోటల పెంపకం, సామూహిక, వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన పనులను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం గుర్తిస్తున్న పనుల్లోనూ కొత్త నిబంధనలే పాటిస్తున్నారు. గతంలో అనేక పనులను ప్రణాళికలో తీసుకున్నా ఈసారి ఏకకాలంలో ఆయా గ్రామాల్లో 20 పనులు మాత్రమే ప్రారంభించి పూర్తి చేసే వెసులుబాటును కల్పించారు. ఒక పని పూర్తయిన తరువాతే మరో పని చేపట్టే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ గ్రామంలో ఉపాధి పనుల గుర్తింపునకు గ్రామ సభలే కీలకంగా మారాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 46.49 లక్షల పనిదినాలు

జిల్లాలో 2022-23 లేబర్‌ బడ్జెట్‌లో 46.49 లక్షల పనిదినాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 18.71 లక్షల పనిదినాలను కల్పించారు. కూలీలకు వేతనాల కింద రూ.37.71 కోట్లు ఖర్చు చేశారు. మెటీరియల్‌ కింద రూ.12.85 కోట్లు, ఇతర రూ.92.96 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధికూలీలు సరాసరి రోజుకు రూ.194.24 కూలి పొందుతున్నారు. 227 కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేశాయి.

వేగంగా ఉపాధి పనులు

కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చినా దానికి అనుగుణంగానే ఉపాధి పనులు వేగంగా చేస్తున్నారు. నేషనల్‌ మోబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా పనులను వెంటవెంట నమోదు చేస్తున్నారు. జిల్లాలో అక్టోబరు వరకు 1681 డైయింగ్‌ ప్లాట్‌ఫాం పనులు మంజూరవగా 772 ప్రగతిలో ఉన్నాయి. రూ.2.11 కోట్ల ఖర్చుతో 612 పూర్తి చేశారు. 1301 పశువుల పాకల నిర్మాణాలు మంజూరవగా రూ.10.83 కోట్లు ఖర్చు చేసి 612 పనులు పూర్తి చేశారు. ఇంకా 271 పనులు కొనసాగుతున్నాయి. గొర్రెలు, మేకల పాకల నిర్మాణాలు 424 మంజూరు చేశారు. వాటిలో రూ.7.23 కోట్లు ఖర్చు చేసి 42 పూర్తి చేయగా 156 పనులు కొనసాగుతున్నాయి. మ్యాజిక్‌ సోప్‌ పీట్‌లు 34,667 మంజూరవగా రూ.17.69 కోట్లు ఖర్చు చేశారు. 27,115 పూర్తి కాగా 876 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఫాంపాండ్‌లు 2167 మంజూరగా రూ.15.97 కోట్లతో 1301 పూర్తి చేశారు. 553 పనులు ప్రగతిలో ఉన్నాయి. గ్రామ సంతలు 20 మంజూరవగా రూ.25.36 లక్షలతో రెండు మాత్రమే పూర్తి చేశారు. నాలుగు ప్రగతిలో ఉండగా 14 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ‘మన ఊరు-మనబడి’లో భాగంగా పాఠశాలల్లో వంట గదుల నిర్మాణాలు 72 మంజూరయ్యాయి. 53 పనులు, మూత్ర శాలల నిర్మాణాలు వంద మంజూరవగా 63 పనులు, ప్రహరీ నిర్మాణాలు 69 మంజూరవగా 38 పనులు ప్రారంభించారు. జిల్లాలో వీటితోపాటు పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్‌ షెడ్‌లు, వైకుంఠధామాల పనులను పూర్తి చేశారు.

జిల్లాలో 2.31 లక్షల మంది కూలీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 1.06 లక్షల జాబ్‌ కార్డులు ఉండగా కూలీలు 2.31 లక్షల మంది ఉన్నారు. దివ్యాంగులకు 2106 జాబ్‌ కార్డులు మంజూరు చేశారు. జిల్లాలో 45,342 ఉపాధిహామీ కుటుంబాలు 65,921 మంది ఉపాధిని పొందారు. గ్రామాల్లో నిరంతరం ఉపాధి హామీ పనులు కొనసాగుతుండడంతో గ్రామీణులకు ఉన్న ఊరిలోనే ఉపాధి లభిస్తోంది.

కొనసాగుతున్న గ్రామసభలు

- మదన్‌మోహన్‌, అదనపు డీఆర్డీవో

2023-24 ఆర్థిక సంవతర్సారానికి సంబంధించి ఉపాధిహామీ పనులు, కూలీల బడ్జెట్‌ తయారీకి జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పనులను గుర్తిస్తున్నాం. ఈ నెలాఖరులోగా గ్రామసభలు పూర్తి చేస్తాం. కలెక్టర్‌ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.

Updated Date - 2022-11-16T00:47:53+05:30 IST

Read more