సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-10-11T05:34:12+05:30 IST

మండలాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సూచించారు.

సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలి
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి రూరల్‌, అక్టోబరు 10 : మండలాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సూచించారు. సోమవారం మండల ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధికారులు ఎజెండా అంశాలు చదివి వినిపించగా గ్రామాల్లో గుడుంబా, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, దీంతో యువత పెడదారి పడుతున్నారని, బెల్టు షాపులలో కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆత్మనగర్‌, విట్టంపేట సర్పంచులు శ్రీనివాస్‌, రాజారెడ్డిలు సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సహాయంతో సమస్యను పరిష్కరించాలని ఎక్సైజ్‌ సీఐ రాధకు సూచించారు. గ్రామాలలో మిషన్‌ భగీరథ నీటి సరపర సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని సర్పంచులు తెలపడంతో అధికారుల తీరు మారాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కోండ్రికర్ల గ్రామ శివారులో బ్రిడ్జి నిర్మిస్తానని బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎమ్మెల్యేను సర్పంచు ఆకుల రాజగంగు కోరగా ఆయన స్పందించి నిర్మాణానికి అంచనా వేసి ఉన్నత అధికారులకు పంపామని తర్వలోనే పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఎన్నికల సమయంలో రాసి ఇచ్చిన బాండ్‌ పేపర్‌ హామీలను నెరవేర్చేలా బీజేపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో వైరల్‌ జ్వరాలు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కాటిపల్లి రాధ, ఎంపీడీవో భీమేశ్‌రెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Read more