దేశంలోనే గొప్ప పథకం దళితబంధు
ABN , First Publish Date - 2022-01-22T05:27:22+05:30 IST
దేశంలోనే దళితబంధు పథకం గొప్పదని రాష్ట్ర బీసీ సంక్షే, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

- అర్హులైన దళితులందరికీ అమలు చేస్తాం
- కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశ అమలు
- రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి): దేశంలోనే దళితబంధు పథకం గొప్పదని రాష్ట్ర బీసీ సంక్షే, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో దళితబంధు పథకం అమలుపై జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్‌లతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ ప్రధాన మంత్రిగాని, ముఖ్యమంత్రి గానీ చేపట్టని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపడుతున్నారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలల్ని నిజం చేసేందుకు దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన 17,556 కుటుంబాల ఖాతాల్లో దళితబంధు నగదు జమ చేశామని తెలిపారు. 1500లకు పైగా కుటుంబాలు డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకోగా వారికి శిక్షణ ఇప్పించి యూనిట్లను మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. డెయిరీ షెడ్ల నిర్మాణం కోసం 1.50 లక్షలు అందించామని అన్నారు. 6,800 మంది ట్రాన్‌పోర్టు వాహనాల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో అర్హులైన వారికి లైసెన్సులు ఇప్పించామని తెలిపారు. దళితబంధు పథకంలో లాభసాటిగా ఉండే డెయిరీ యూనిట్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, మిగతా యూనిట్లకు లబ్దిదారులకు అవగాహన కల్పించి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నామని అన్నారు. జిల్లాలోని కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశలో మార్చి 31వ తేదీలోగా వంద యూనిట్ల చొప్పున దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 15వ తేదీలోగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారుల సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేసి మార్చి 1వ తేదీలోగా జాబితా తయారు చేయాలని సూచించారు. దశలవారీగా దళిత కుటుంబాలందరికీ దళితబంధు అమలు చేస్తామని, ఎవ్వరూ కూడా నిరాశ చెందవద్దని మంత్రి సూచించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, తదితరులు దళితబంధు పథకం అమలు తీరుపై సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ అర్హులైన దళితులందరికీ పథకం అమలు చేస్తామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలు లాభసాటి స్వయం ఉపాధి యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశలో నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున మంజూరు చేస్తామని అన్నారు. దశలవారీగా అర్హులందరికీ దళితబంధు పథకం అమలు అవుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమవేశంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
రూ. 2.60 కోట్ల దళితబంధు ఆస్తులు పంపిణీ
6 హార్వెస్టర్లు, 3 జేసీబీలు, 1 డీసీఎం పంపిణీ చేసిన మంత్రి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద శుక్రవారం దళితబంధు ఆస్తులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. 24 మంది లబ్ధిదారులకు 10 యూనిట్లుగా 6 హార్వెస్టర్లు, 3 జేసీబీలు, 1 డీసీఎం వ్యాన్లు మంత్రి పంపిణీ చేశారు. ఒక్కో హార్వెస్టర్ 22 లక్షలు, ఒక్కో జేసీబీ 34 లక్షలు, డీసీఎం వ్యాన్ 24 లక్షల రూపాయలు కాగా మొత్తం 2 కోట్ల 60 లక్షల విలువచేసే వాహనాలను లబ్ధిదారులకు అందించామని మంత్రి తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి హార్వెస్టర్లు, జేసీబీలు, డీసీఎం వ్యాన్ ఎంపిక చేసుకున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హార్వెస్టర్లు నడిపి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పొరేషన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, క్లస్టర్ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.