సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీలో వసూళ్ల దందా

ABN , First Publish Date - 2022-09-19T05:58:10+05:30 IST

సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ నియామకాల్లో వసూళ్ల దందాకు తెరలేపారు.

సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీలో వసూళ్ల దందా
ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం

- టెండర్‌ను మించి రెట్టింపు సంఖ్యలో భర్తీ

- ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు వసూలు

- భూనిర్వాసితులు, ప్రభావిత నిరుద్యోగుల నోట్లో మట్టి

- ఆధార్‌లో అడ్రస్‌లు మార్చి స్థానికేతరులకు అవకాశం

గోదావరిఖని, సెప్టెంబరు 18: సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ నియామకాల్లో వసూళ్ల దందాకు తెరలేపారు. నిరుద్యోగుల నుంచి రూ.2లక్షల నుంచి రూ.3లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆర్‌జీ-1 పరిధిలో టెండర్‌కంటే రెట్టింపు సంఖ్యలో గార్డులను నియమించారు. భూ నిర్వాసితులకు, ప్రభావిత గ్రామాలకు నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను అమ్ముకున్నారు. సెక్యూరిటీ గార్డుల నియామకాల పేరిట సుమరు రూ.4కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌జీ-1లో మూడు ఏజెన్సీలు టెండర్‌ దక్కించుకున్నాయి. ఆర్‌జీ-1 పరిధిలోని జీఎం కార్యాలయం, సివిల్‌ డిపార్ట్‌మెంట్‌, జీడీకే 1, 3, 2, 2ఏ, 11ఇంక్లైన్‌, వర్క్‌షాప్‌, మేడిపల్లి ఓసీపీ, సింగిరెడ్డిపల్లి చెక్‌పోస్టుతో పాటు ఇతర ఏరియాల్లో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుల నియామకానికి టెండర్లను పిలిచారు. మొత్తం ఆర్‌జీ-1 పరిధిలో 120 మంది గార్డులు అవసరం ఉండగా, అందుకు రెట్టింపు నియామకాలను చేపట్టారు. ఆర్‌జీ-1లో ఎస్‌టీఎస్‌, డెల్టా, ట్రిపుల్‌ ఎస్‌(గుర్క) ఏజెన్సీలు టెండర్‌ దక్కించుకున్నాయి. ఎస్‌టీఎస్‌ 35మందికి 60మందిని, డెల్టా 33మందికి 62మందిని, ట్రిపుల్‌ ఎస్‌(గుర్క) 41మందికి 65మందిని నియమించింది. టెండర్‌ ప్రకారం ఒక్కొక్కరికి రూ.800 చొప్పున వేతనం కట్టివ్వాల్సి ఉండగా, గార్డులకు రోజుకు రూ.500 చెల్లిస్తోంది. ఇందులో అదనంగా రూ.70పీఎఫ్‌ను కట్‌ చేస్తున్నాయి. వాస్తవానికి లెక్కకు మించి గార్డులను నియమించడంలో సింగరేణి అధికారుల అండదండలతోనే ఈ తంతంగం నడుస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీ కూడా సింగరేణిలో సెక్యూరిటీ గార్డుల నుంచి అక్రమ వాసూళ్లపై తమ వైఖరి మార్చుకోవాలని, లేకుంటే వారికి శిక్ష తప్పదంటూ కోల్‌బెల్ట్‌ ఏరియా కార్యదర్శి ప్రభాత్‌ పేరిట ప్రకటన విడుదల అయ్యింది. అమాయకుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రామగుండం రీజియన్‌లో సెక్యూరిటీ గార్డు నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, భూ నిర్వాసితులను కాదని స్థానికేతరులను ఉద్యోగాల్లో నియమించారని, వారిని ఒత్తిడికి గురి చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. 

భూనిర్వాసితులకు అన్యాయం..

టెండర్‌లో సింగరేణి ప్రభావిత గ్రామాలైన ముస్త్యాల, సుందిళ్ల, జనగామ గ్రామాల నిరుద్యోగులకు 80శాతం మందికి ఉద్యోగాలు కల్పించిన తరువాతనే మిగతా వారిని తీసుకోవాల్సి ఉండగా, అలా కాకుండా 20శాతం కూడా ప్రభావిత గ్రామాల యువకులను తీసుకోకుండా 80శాతం బయటి వారిని, స్థానికేతరులను ఉద్యోగాలు తీసుకున్నారు. భూనిర్వాసితులు, ప్రభావిత గ్రామాల యువకులకు అన్యాయం చేశారు. 

అడ్రస్‌లు మార్చి..

స్థానికులను కాకుండా మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌ ప్రాంతాలకు చెందిన వారిని అడ్రస్‌లు మార్చి ఉద్యోగాల్లో నియమించుకున్నారు. ఇక్కడి వారిని కాకుండా ఇతర ప్రాంతాల వారిని ఇక్కడి అడ్రస్‌లతో అనుమానాలు రాకుండా రికార్డులో ఇక్కడ స్థానిక అడ్రస్‌ ఉండే విధంగా ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. చివరికి ఆధార్‌ కార్డులో అడ్రస్‌లు మార్చి ఉద్యోగాలు అమ్ముకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. 

ప్రమాదం జరిగితే..

విధి నిర్వహణలో ప్రమాదం జరిగితే వారికి ఎటువంటి బెనిఫిట్స్‌ రావని ముందే బాండ్‌ పేపర్లు రాయించుకున్నారు. 129మందికి పీఎఫ్‌, సింగరేణి ఆసుపత్రిలో వైద్య సౌకర్యం ఉండగా, 72మందికి ఎలాంటి బెనిఫిట్స్‌ వర్తించడం లేదు. గైర్హాజర్‌ అయిన సెక్యూరిటీ గార్డుల స్థానంలో వీరికి అవకాశం కల్పించడంతో పాటు ప్రతిరోజు రొటేషన్‌ పద్దతిలో 72మందికి విధులు కేటాయిస్తున్నట్టు సమాచారం. 

రోజుకు పది మంది ఇంటికి..

రోజుకు పది మందిని హాజరు వేసుకుని ఇంటికి పంపిస్తున్నారు. వారిని లెక్కల్లో చూపకుండా షిఫ్టుకు 10మంది చొప్పున ఇంటికి పంపుతూ వారికి వచ్చే వేతనాలు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్టు జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నెలకు రూ.5లక్షల వరకు మస్టర్ల రూపంలో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్లు మస్టర్ల మీద సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కొంత మంది ఇన్‌స్పెక్టర్లు గార్డులను తమ ఇంటి వద్ద సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు. గార్డు నుంచి సీనియర్‌ ఇన్‌స్పెక్టర్ల వరకు పదోన్నతి పొందిన వరకు ఇక్కడే విధులు నిర్వహించడంతో పాటు స్ర్కాప్‌ దుకాణాలు వద్ద మామూళ్లును, బొగ్గు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

అధికారుల అండదండలు..

టెండర్‌ ప్రకారం గార్డులను నియమకం చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రెట్టింపు గార్డులను నియామకంలో అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. పైస్థాయి అధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు మూముళ్లు ముడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓ స్ర్కాప్‌ దుకాణం వద్ద ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మామూళ్ల విషయంలో గొడవలకు దిగారని సమాచారం. స్ర్కాప్‌ దుకాణ యజమాని ముందే డబ్బుల కోసం కొట్టుకునే ప్రచారం ఉంది. ఈ దందా వసూళ్లపై మావోయిస్టులు కూడా కన్నెర్ర చేయడం, శ్రీరాంపూర్‌, మందమర్రి, భూపాలపల్లి ఏరియాల్లో కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేయడం, కాంట్రాక్టర్లకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. సింగరేణిలో నూతనంగా నియామకమైన చీఫ్‌సెక్యూరిటీ ఆఫీసర్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి శశిధర్‌రాజు విచారణ చేశారు. గార్డుల నియామకాలపై, డబ్బుల వసూళ్లపై ఒక నివేదిక తయారుచేసి సీఎండీకి అందించినట్టు సమాచారం. 

Read more