చండికా... సెలవిక

ABN , First Publish Date - 2022-10-07T06:13:51+05:30 IST

శరన్నవరాత్ర్యుత్సవాల సందర్భంగా మంటపాల వద్ద ప్రతిష్టించిన దుర్గామాత నిమజ్జనోత్సవం గురువారం వైభవంగా జరిగింది.

చండికా... సెలవిక
టవర్‌సర్కిల్‌ వద్ద అమ్మవారి ఊరేగింపు

- నేత్రపర్వంగా దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబర్‌ 6: శరన్నవరాత్ర్యుత్సవాల సందర్భంగా మంటపాల వద్ద ప్రతిష్టించిన దుర్గామాత నిమజ్జనోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వాహనాల్లో దుర్గాదేవిని అలంకరించి శోభాయాత్రకు తరలించగా భక్తులు, భవానీ దీక్షాపరులు, ఉత్సవ కమిటీ బాధ్యులు కాషాయ ధ్వజాలు, టపాసుల మోతలు, భజనలు, భక్తిపాటలు, మేళతాళాలు, మంగళహారతులు, డప్పువాయిద్యాలు, నృత్య ప్రదర్శనల మధ్య అమ్మవారిని ఊరేగిస్తూ శోభయాత్ర నేత్రపర్వంగా కొనసాగించారు. టపాసుల మోతతో టవర్‌ ప్రాంతం దద్దరిల్లింది. దారి పొడవునా అమ్మవారిని దర్శించుకుని ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు. రాజీవ్‌చౌక్‌, పోస్టుఆఫీస్‌చౌరస్తా, టవర్‌సర్కిల్‌ చేరి అక్కడి నుంచి విగ్రహాన్ని మానకొండూర్‌ చెరువుకు తరలించారు. 

భారీ పోలీసు బందోబస్తు

నిమజ్జనం సందర్భంగా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. రాజీవ్‌చౌక్‌, పాతబజార్‌, తెలంగాణచౌక్‌ తదితర ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. మొబైల్‌, ఐడి పార్టీలు ఎప్పటికప్పుడు తిరుగుతూ పరిస్థితి సమీక్షించారు.

Read more