ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

ABN , First Publish Date - 2022-10-17T05:40:40+05:30 IST

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌- 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు పరుగులు తీయడం కనిపించింది.

ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌
పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలు

-   కట్టుదిట్టమైన బందోబస్తు

- సకాలంలో చేరుకోలేక వెనుదిరిగిన అభ్యర్థులు

- 4,266 మంది అభ్యర్థులకు 3,520 మంది హాజరు 

- 82.51 హాజరు శాతం 

- చివరి నిమిషంలో వచ్చిన అభ్యర్థుల వాగ్వాదం

- పరీక్షను పర్యవేక్షించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌- 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం   ప్రశాంతంగా ముగిసింది.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు పరుగులు తీయడం కనిపించింది. రాజన్న సిరిసిల్లజిల్లా కేంద్రంలో 15 పరీక్ష కేంద్రాలు, వేములవాడ మండలం అగ్రహారంలో డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో  అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష కేంద్రానికి 8.30 గంటలకే చేరుకోవాలని అధికార యంత్రాంగం సూచనలు చేసినా ఆలస్యంగా వచ్చి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను వెతుక్కుంటూ పరుగులు తీశారు. అధికారులు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూసినా కొందరు చివరి క్షణంలో పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష  సమయంకాగా 10.15 గంటల తరువాత ఎవరినీ కేంద్రంలోకి అనుమతించలేదు. ముందే చెప్పినట్లు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు. చివరి ఒకటి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందారు. పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. పలువురు అభ్యర్థులు అనుమతించాలని బందోబస్తులో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. మరికొందరు చివరి నిమిషంలో  కేంద్రానికి చేరుకొని పరీక్ష రాసిన వారు ఉన్నారు. పరీక్ష కేంద్రం వద్ద తమ పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పగించి పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద పిల్లలతో తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు వారిని ఆడిస్తూ కనిపించారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా ఉన్నతాధికారులు, పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. 

 3,520 మంది అభ్యర్థుల హాజరు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4266 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 3520 మంది హాజరయ్యారు. 746 మంది గైర్హజరయ్యారు. 82.51  హాజరు శాతం నమోదైంది.  సహస్త్ర జూనియర్‌ కళాశాలలో 372 మందికి  315 మంది, గీతానగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో 360 మందికి 310, సాయిశ్రీ జూనియర్‌ కళాశాలలో 336 మందికి 273, శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో 336 మందికి 278, కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో 312 మందికి 257, విజ్ఞానవర్ధిని ఉన్నత పాఠశాలలో 240 మందికి 192, పత్తిపాక సిద్ధార్థ ఇంగ్లీష్‌ మీడియంలో 312 మందికి 250, శివనగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో 240 మందికి 210, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 240 మందికి 186, కృష్ణదేవరాయ  జూనియర్‌ కాలేజీలో 240 మందికి 198, సెస్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 200 మందికి 170, అయ్యప్ప డిగ్రీ కాలేజీలో 168 మందికి 143, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 144 మందికి 120, శివనగర్‌ సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో 144 మందికి 111, వెంకంపేట జడ్పీ హెచ్‌ఎస్‌లో 144 మందికి 116, అగ్రహారంలో ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 240 మందికి 195, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 238 మందికి 196 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద బయోమెట్రిక్‌తో గుర్తింపు కార్డులను పరిశీలించి అభ్యర్థులను అనుమతించారు. పరీక్ష నిర్వహణలో ఐదు రూట్లలో లైజనింగ్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 17 మంది అఽధికారులు సిట్టింగ్‌ స్క్వాడ్‌, అసిస్టెంట్‌ లైజనింగ్‌ అధికారులు, చీప్‌ సూపరింటెండెంట్‌లు, కేంద్రానికి 20 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు. పరీక్షలు రాయడానికి 170 గదులను వినియోగించారు. ప్రతీ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

భారీ బందోబస్తు 

జిల్లాలో 17 కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఐదు రూట్లలో మోబైల్‌ ఎస్కార్ట్‌ పార్టీలతోపాటు 120 మంది సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గురు సీఐలు, 11 మంది ఎస్సైలు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి భద్రతా చర్యలు చేపట్టారు. 


పరిశీలించిన కలెక్టర్‌ 

వేములవాడ మండలం అగ్రహారంలోనే పాలిటెక్నిక్‌ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్‌ విధానం సీసీ కెమెరాలు, పరీక్ష నిర్వహణను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి  పరిశీలించారు.   సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు అగ్రహారంలో నిర్వహించిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. పరీక్షకు 4266 మంది అభ్యర్థులకు 746 మంది గైర్హజరయ్యారని 82.51 శాతం హాజరు శాతం నమోదైందని తెలిపారు.  


Updated Date - 2022-10-17T05:40:40+05:30 IST