కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST
తీగల వంతెన అప్రోచ్ రోడ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.

మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తీగల వంతెన అప్రోచ్ రోడ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మానేరు రివర్ ఫ్రంట్, సుడా అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల రోడ్డులో సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఆర్డీవో ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ పాల్గొన్నారు.
ప్రతిభను నమ్ముకొని ఎదగాలి
యువత ప్రతిభను నమ్ముకుని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్పగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం నగరంలోని బీఆర్ అంబేద్కర్ మినీ స్టేడియంలో డీసీఎస్ అండ్ స్టాఫ్ఫిక్స్ ప్రైవేట్ సహకారంతో జిల్లా యువజన సర్వీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగాలు రావాలని, ప్రతిభ ప్రదర్శించేందుకు జాబ్‌మేళాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 83 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. మెరిట్ ఆఆధారంగా ఉద్యోగాలు కల్పించేందుకు పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జాబ్‌మేళాలో వివిధ కంపెనీలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించి అభినందించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ యువత ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా యువజన, క్రీడాధికారి రాజవీరు మాట్లడుతూ జాబ్‌మేళాలో 26 కంపెనీలు పాల్గొన్నాయని, 348 మందికి నియామక పత్రాలు అందజేశామని, 466 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారని తెలిపారు.
సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతాం..
కరీంనగర్ టౌన్: కరీంనగర్‌ను సమస్యలు లేని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం నగరంలోని 21, 40 డివిజన్లలో ఆయన పర్యటించారు. 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్‌తో కలిసి సీతారాంపూర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 21వ డివిజన్లో 15వ ఆర్థిక సంఘం నిధులు 30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, 40వ డివిజన్ తులసీనగర్‌లో మూడు లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభించి మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు భూమాగౌడ్, దిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్, గంట కల్యాణి శ్రీనివాస్, తులా రాజేశ్వరి బాలయ్య, ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈ కిష్టప్ప పాల్గొన్నారు.