ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం
ABN , First Publish Date - 2022-10-18T04:58:01+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సూక్ష్మ పోషకాలతో కూడిన పౌష్టిక అల్పాహారాన్ని ఉదయం ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు.
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
కరీంనగర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సూక్ష్మ పోషకాలతో కూడిన పౌష్టిక అల్పాహారాన్ని ఉదయం ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు శివారులోని ముద్దెనహళ్లి సాయినగర్‌లో శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు వ్యవస్థాపకుడు సద్గురు మధుసూదనసాయితో వినోద్‌కుమార్ సోమవారం భేటీ అయ్యారు. ఆ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పౌష్టిక ఆహారం సరఫరా కార్యక్రమాన్ని వినోద్‌కుమార్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్టు సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. విటమిన్స్, మినరల్స్‌తో కూడిన పౌష్టిక అల్పాహారాన్ని, రాగి జావ, చాకొలేట్ ఫ్లేవర్ పానీయం, సాయి పౌష్టిక ద్రావణం అందిస్తామన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు వినోద్‌కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు జిల్లా సమన్వయకర్త కన్నం రమేశ్ పాల్గొన్నారు.