బస్తీమే సవాల్‌..

ABN , First Publish Date - 2022-08-04T05:37:23+05:30 IST

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్టు ఉద్యోగాల వ్యవహారం చినికిచినికి గాలి వానలా మారింది.

బస్తీమే సవాల్‌..

- రాజకీయ దుమారం రేపిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వ్యవహారం

- ఉద్యోగాల పేరిట లక్షలు తీసుకుని దళారుల మోసం

- బాధితులకు అండగా నిలిచిన ప్రతిపక్షాలు

- అధికార పార్టీ నేతలే మోసం చేశారంటూ ఆరోపణలు

- నేడు గేట్‌ వద్దకు రావాలని సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే

- అప్పు పత్రాలు రాసిస్తున్న దళారులు, పలువురిపై కేసులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్టు ఉద్యోగాల వ్యవహారం చినికిచినికి గాలి వానలా మారింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య రాజకీయ దుమారానికి దారితీసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని, ఇందుకు ఎమ్మెల్యే బాధ్యత వహించి డబ్బులు ఇప్పించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. తానెవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, తీసుకున్నట్లయితే నిరూపించాలని, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో బాధితులు చెబితే, అందులో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టేది లేదని, ఈనెల 4న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గేటు వద్దకు బహిరంగ చర్చకు రావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సవాల్‌ విసరడం ఉత్కంఠకు దారితీస్తున్నది. రామగుండంలో పునరుద్ధరించిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కర్మాగారంలో గత ఏడాది నుంచి యూరియా ఉత్పత్తిని ప్రారంభించారు. ఇందులో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన యూరియా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసేందుకు, స్వీపింగ్‌, తదితర కూలీ పనులు చేసేందుకు 440 మందికి సంస్థ ఒక కాంట్రాక్టు ఏజెన్సీకి బాధ్యత అప్పగించింది. ఈ కార్మికులుగా పనిచేసేందుకు స్థానికులకే అవకాశం ఇవ్వాలని పునర్నిర్మాణ సమయంలో సంస్థకు విన్నవించారు. దీనిని ఆసరా చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కొందరు నాయకులు, ఇతరులు లేబర్‌ కాంట్రాక్టు పొందిన వారితో సంప్రదింపులు జరిపి వాళ్లకు కొంతమేరకు డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. 

నిరుద్యోగులను నమ్మించి..

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పర్మనెంట్‌ ఎద్యోగాలు పెట్టిస్తామని, నెలకు 30 నుంచి 50వేల వరకు వేతనాలు వస్తాయని, భవిష్యత్తు కూడా బాగుంటుందని నిరుద్యోగులను నమ్మించారు. డిమాండ్‌ క్రియేట్‌ చేసి ఒక్కొక్కరి వద్ద నుంచి 6 నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. 440 కార్మికుల్లో 120 వరకు పైగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సిఫారసు మేరకు కాంట్రాక్టు సంస్థ ఉచితంగా పనిలోకి తీసుకుని గేట్‌ పాసులను జారీ చేసింది. దళారులు మాత్రం 550 మంది డబ్బులు వసూలు చేసి  వారందరికీ కూడా గేటు పాసులు ఇప్పించారని సమాచారం. అయితే నిరుద్యోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన దళారులు మరికొందరికి వాటాలు పంచినట్లుగా తెలుస్తున్నది. గేటు పాసులు ఇప్పించిన వారిలో కొందరు 3 నెలల పాటు పనిచేసిన కొందరు పూర్తిగానే పని మానేశారు. ఎందుకంటే రోజుకు 480 రూపాయల చొప్పున లేబర్‌ చార్జీ ఇస్తున్నారు. నెలకు 15వేల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయం చూసుకునేందుకు బయటకు వెళ్లిపోయారు. మరికొందరికి గేట్‌ పాసులు జారీ కాలేదు. ఈ ఏడాది జనవరిలో కార్మికులను పనిలో తీసుకునే విషయమై అవకతవకలు జరుగుతున్నాయని గమనించిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మరో సంస్థకు లేబర్‌ కాంట్రాక్టును అప్పగించింది. ఆ సంస్థ తక్కువ మస్టర్లు ఉన్న కార్మికులను వచ్చి రాగానే తొలగించింది. అలాగే గేటు పాసులు లేక మరికొందరు దళారుల చుట్టూ తిరుగుతున్నారు. పనిలో నుంచి తొలగించిన వాళ్లు, ఈ పని తమకు వద్దని భావించిన కొందరు, గేట్‌ పాసుల కోసం వెయిటింగ్‌లో ఉన్న వాళ్లు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని దళారుల చుట్టూ తిరిగారు. వాళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతో జూలై 23న గోదావరిఖని చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేశారు. తమ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు ఎమ్మెల్యే బంధువు ఒకరు డబ్బులు వసూలుచేశారని ఆరోపించారు. పర్మనెంట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వేలాది రూపాయల వేతనాలు వస్తాయని, భవిష్యత్తులో కూడా వాటిని విక్రయించుకోవచ్చని దళారులు తమను నమ్మబలికించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తిపాస్తులు, భార్య పుస్తెలతాళ్లను అమ్ముకున్నామని, దళారులకు లక్షల్లో డబ్బులు ఇచ్చి మోసపోయామన్నారు. వీరికి అండగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పలు కార్మిక సంఘాల నాయకులు వారికి అండగా నిలిచారు. నిరుద్యోగుల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు సుమారు 45 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని, ఇందుకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 

ఎమ్మెల్యే సవాల్‌తో..

ప్రతిపక్ష పార్టీలను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. తామెవరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయలేదని, బాధితులకు న్యాయం చేసేందుకు 18 మందితో కమిటీ వేస్తున్నామన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలందరితో కలిసి కమిటీ వేస్తే దానికి అర్థం ఏముంటుందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీంతో మళ్లీ రంగంలోకి దిగిన ఎమ్మెల్యే చందర్‌ బాధితుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. ఈనెల 4న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గేటు వద్దనే తేల్చుకుందామన్నారు. ఉద్యోగాల పేరుతో దళారులకు డబ్బులు ఇచ్చిన బాధితులకు తాను అండగా ఉంటానని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖకు సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారు. డబ్బులు తీసుకున్న వారిలో టీఆర్‌ఎస్‌ పార్టీ వారు ఎవరైనా దోషులుగా తేలితే పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం ఉత్కంఠకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గేట్‌ వద్దకు వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారని సమాచారం. అయితే ఇదంతా రచ్చరచ్చ అయ్యే అవకాశాలున్నాయని భావించిన పలువురు దళారులు బాధితులకు వారి వద్ద నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు పత్రాలు రాసి ఇస్తున్నారు. మరికొందరు బాధితులు ఆయా పోలీస్‌ స్టేషన్లలో దళారులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్కంఠను రేపుతున్న ఈ వ్యవహారంలో బాధితులకు ఏ మేరకు న్యాయం జరగనున్నదో వేచిచూడాలి. 

Updated Date - 2022-08-04T05:37:23+05:30 IST