పెళ్లికాని అబ్బాయిలకు ఎర

ABN , First Publish Date - 2022-07-05T05:57:14+05:30 IST

పెళ్లికాని అబ్బాయిలను ఎంచుకొని, అమ్మాయి ఫొటోతో ఫేక్‌ ప్రొఫైల్‌ సృష్టించి పలువురు యువకులను మోసం చేసిన ఘరానా మోసగాడు కోమలి సూర్యప్రకాష్‌ (30)ను సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు.

పెళ్లికాని అబ్బాయిలకు ఎర
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ అఖిల్‌ మహాజన్‌

- అమ్మాయి ఫేక్‌ ఐడీతో ఘరానా మోసం

- మ్యాట్రిమోని మోసగాడి అరెస్టు

- రూ. 14 లక్షలు స్వాధీనం

- వివరాలు వెల్లడించిన డీసీపీ అఖిల్‌ మహాజన్‌ 

జ్యోతినగర్‌, జూలై 4: పెళ్లికాని అబ్బాయిలను ఎంచుకొని, అమ్మాయి ఫొటోతో ఫేక్‌ ప్రొఫైల్‌ సృష్టించి పలువురు యువకులను మోసం చేసిన ఘరానా మోసగాడు కోమలి సూర్యప్రకాష్‌ (30)ను సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహాజన్‌ వివరాలు వెల్లడించారు. ఆంద్రప్రదేశ్‌లోని  కాకినాడ రూరల్‌ సూర్యారావుపేటకు చెందిన కోమలి సూర్యప్రకాష్‌ జూదం (గ్యాబ్లింగ్‌), జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో మకాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన అల్వాల్‌(హైదరాబాద్‌)కు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూర్యప్రకాష్‌పై రాంగోపాల్‌పేట్‌లో కేసు నమోదై జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో మ్యాట్రిమోనీలో తప్పుడు ఐడీ సృష్టించి అమాయకపు యువకులను మోసం చేయాలని పథకం వేశాడు.  తెలుగు మ్యాట్రిమోని డాట్‌కాంలో దివ్యశ్రీ పేరుతో ఒక అమ్మాయి ఫొటోతో ఫేక్‌ ప్రొఫైల్‌(ఐడీ) క్రియేట్‌ చేశాడు. వాట్సప్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశాడు. మ్యాజిక్‌ కాల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. ఈ ప్రొఫైల్‌కు ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన మూడెత్తుల సురేష్‌ అనే యువకుడు పెళ్లి కోసం రిక్వెస్ట్‌ పెట్టాడు. ఈ రిక్వెస్ట్‌ను దివ్యశ్రీ పేరుతో ఉన్న సూర్యప్రకాష్‌ ఓకే చెప్పాడు. తరువాత మ్యాజిక్‌ కాల్‌ యాప్‌లో ఆడగొంతుతో సురేష్‌తో మాట్లాడడమే కాకుండా వాట్సప్‌లో తరుచూ సూర్యప్రకాష్‌ చాటింగ్‌ చేశాడు. ఒక రోజు తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని, ట్రీట్‌మెంట్‌కు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతాయని సూర్యప్రకాష్‌ ఫోన్‌ చేశాడు. తమకు పొలం ఉందని, దానిని అమ్మిన తరువాత డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఇది నమ్మిన సురేష్‌ రెండు విడతల్లో ఎనిమిది లక్షల రూపాయలు సూర్యప్రకాష్‌ ఇచ్చిన అకౌంట్లో జమ చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు సురేష్‌ తన డబ్బు తిరిగి ఇవ్వమని సూర్యప్రకాష్‌పై ఒత్తిడి చేసినా దాట వేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన సురేష్‌ గత నెల ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎన్టీపీసీ పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్‌ డేటా తదితర ఆధారాలతో లోతుగా దర్యాప్తు చేసి అమ్మాయి పేరుతో సూర్యప్రకాష్‌ మోసం చేశాడని గుర్తించి అతని కోసం గాలించారు. ఈ నేపథ్యంలో మరోసారి సూర్యప్రకాష్‌ ఆడగొంతుతో సురేష్‌కు ఫోన్‌ చేసి మరో రెండు లక్షల రూపాయలు కావాలని కోరాడు. తన బాబాయ్‌ను ఎన్టీపీసీకి పంపిస్తున్నానని, రెండు లక్షలు ఇవ్వాలని చెప్పాడు. విషయం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గౌతమినగర్‌కు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత అదుపులో ఉన్న వ్యక్తి సూర్యప్రకాష్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు డీసీపీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. నిందితుడు సూర్యప్రకాష్‌ ఒడిశా పరిధిలో ఆర్మీలో పనిచేస్తున్న కుమార్‌ను, బెంగళూరు, నెల్లూరుకు చెందిన యువకులను మోసం చేసినట్లు నిర్ధారణ అయ్యిందని ఆయన చెప్పారు. ఈ నలుగురు నుంచి సుమారు 18 లక్షల రూపాయలు సూర్యప్రకాష్‌ వసూలు చేసినట్లు తెలిపారు. అతని ఫోన్‌ డేటా ఆధారంగా సూర్యప్రకాష్‌ దేశ వ్యాప్తంగా మ్యాట్రిమోని ద్వారా తెలిసిన 25 మందితో మ్యాజిక్‌ యాప్‌ ద్వారా ఆడగొంతతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు తేలిందని డీసీపీ మహాజన్‌ పేర్కొన్నారు. అతని నుంచి నుంచి  14 లక్షల రూపాయలు, 18 సిమ్‌కార్డులు, సెల్‌ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. బాధితులకు సంబంధించిన ఆయా పోలీస్‌స్టేషన్లకు సూర్యప్రకాష్‌ వివరాలను తెలియజేస్తున్నామన్నారు. నింతుడిని పట్టుకోవడంలో సమర్థవంతంగా పని చేసిన సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు జీవన్‌, సాగర్‌, పీసీలు అజయ్‌, ఆంజనేయులను డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. 


Updated Date - 2022-07-05T05:57:14+05:30 IST