సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-12-07T00:24:31+05:30 IST

జిల్లా కేంద్రంలో ఈ నెల 8న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారని, ఈ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా కేంద్రంలో ఈ నెల 8న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారని, ఈ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అఽధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 7న సాయంత్రం జగిత్యాల బహిరంగ సభ ముగించుకొని రాత్రి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణభవన్‌లో బస చేస్తారన్నారు. 8న మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ కూతురు వివాహానికి హాజరవుతారని, మార్గమధ్యలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని సందర్శించి ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా నగరంలో ప్రభుత్వ శాఖలు తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని మంత్రి గంగుల ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సీఎం పర్యటన పూర్తయ్యేవరకు విద్యుత్‌ అంతరాయం లేకుండా ట్రాన్స్‌కో అధికారులు చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు.

ఫ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ఇక కరీంనగర్‌ సర్కూట్‌ రెస్ట్‌ హౌస్‌ (కేసీఆర్‌)

కరీంనగర్‌ టౌన్‌: నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కి కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌ హౌస్‌(కేసీఆర్‌)గా నామకరణం చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. మంగళవారం ఆయన ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో పనులను మేయర్‌ సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా అతిథి గృహం ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం బస కోసం పై అంతస్తులో సగం మేరకు కేటాయిస్తున్నామని, కింది భాగంలో సాధారణ అతిథి గదులు, మంత్రులు, ఇతర ప్రముఖులు బస చేసేందుకు డూప్లెక్స్‌ నమూనాలో మూడు గదులను నిర్మించినట్లు తెలిపారు.

ఫ వైద్య కళాశాల స్థలం పరిశీలన

కరీంనగర్‌ రూరల్‌, డిసెంబరు 6: విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కొత్తపల్లి పట్టణంలో వైద్య కళాశాల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని మంగళవారం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, డీఎంఈ రమేష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో తాత్కాళిక భవనాల్లో తరగతులను ప్రారంభిస్తామన్నారు. కొత్తపల్లి సీడ్‌ ఫాంలోని గోదాంలను ఆధునీకరించి అందులో తాత్కాళికంగా తరగతులను ప్రారంభించి తర్వాత శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మించేందుకు కొత్తపల్లి విత్తన శుద్ధి కర్మాగారం సమీపంలో 25 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. మెడికల్‌ కళాశాలకు కావాల్సిన ఐదు వందల పడకల ఆసుపత్రి ఇప్పటికే కరీంనగర్‌లో అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ఛైర్మన్‌ రుద్ర రాజు, డీఏవో శ్రీధర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రత్నమాల, టీఆర్‌ఎస్‌ నాయకులు చల్లా హరిశంకర్‌, వాసాలరమేష్‌, జమీలుద్దీన్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:24:39+05:30 IST