స్థలాల క్రమబద్ధీకరణకు కసరత్తు

ABN , First Publish Date - 2022-09-28T04:59:20+05:30 IST

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఆ స్థలాల క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తుల పరిశీలన మొదలయ్యింది.

స్థలాల క్రమబద్ధీకరణకు కసరత్తు
సుల్తానాబాద్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ప్రత్యేక బృందం(ఫైల్‌)

- జీవో 59 కింద 1,464 దరఖాస్తులు

- క్షేత్రస్థాయిలో పరిశీలనకు 14 బృందాలు

- ఈనెలాఖరు వరకు పూర్తికానున్న ప్రక్రియ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఆ స్థలాల క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తుల పరిశీలన మొదలయ్యింది. ఐదు రోజుల నుంచి క్షేత్ర స్థాయిలో ప్రత్యేకించి నియమించిన బృందాలు పరిశీలన చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించిన వారికి ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. జీవో 58 ప్రకారం దరఖాస్తు చేసుకుంటే 125 గజాల భూమి ఉన్నట్లయితే క్రమబద్ధీకరణ కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. 59 జీవో ప్రకారం మాత్రం 125 గజాల స్థలానికి మించి ఉన్నట్లయితే క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలన అనంతరం అర్హత కలిగి ఉంటే సరిపడా ఫీజు చెల్లించిన తర్వాత ఆ స్థలాన్ని వారి పేరిట క్రమబద్ధీకరించనున్నారు. 2015లో దీనిని మొదట తీసుకువచ్చారు. 2014 జూన్‌ 2వ తేదీకి ముందు ఇంటిని నిర్మించుకుని ఇంటి పన్ను, విద్యుత్‌ బిల్లు, నల్లా బిల్లులు చెల్లిస్తున్న వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా విధించారు. ఆ తర్వాత 2020లో మరోసారి అవకాశం కల్పించారు. ఈ ఏడాది మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ మార్చి నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

జిల్లాలో 1464 దరఖాస్తులు

జిల్లా వ్యాప్తంగా 1464 దరఖాస్తులు వచ్చాయి. అంతర్గాం మండలంలో 14, ధర్మారం మండలంలో 47, ఎలిగేడు మండలంలో 157, జూలపల్లి మండలంలో 9, కమాన్‌పూర్‌ మండలంలో 5, మంథని మండలంలో 340, రామగిరి మండలంలో 368, ముత్తారం మండలంలో 2, పాలకుర్తి మండలంలో 175, రామగుండం మండలంలో 149, ఓదెల మండలంలో 5, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 57, సుల్తానాబాద్‌ మండలంలో 138 దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ ప్రత్యేక బృందాలను నియమించగా, అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. జిల్లా, డివిజన్‌ స్థాయిలో ఉండే ఒక ప్రత్యేక అధికారి, డిప్యూటీ తహసిల్దార్‌, ఆర్‌ఐ, సర్వేయర్‌లతో కూడిన 14 బృందాలను నియమించారు. 59 జీవో వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకించి ఒక యాప్‌ను రూపొందించింది. క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లే అధికారుల బృందం జీవో 59 యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో దరఖాస్తు నంబర్‌ను ఎంటర్‌ చేయగానే మొత్తం వివరాలు యాప్‌లో ప్రత్యక్షం అవుతాయి. ఆ వెంటనే అందులో పేర్కొన్న ప్రకారం మోఖా మీద ఎంత స్థలంలో ఇంటిని నిర్మించారు, ఎంత ఆధీనంలో ఉంది, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి కొలతలు తీసి యాప్‌లో నమోదు చేస్తారు. అలాగే ఆ ఇంటి ముందు ఫొటోలు దిగి వాటిని కూడా డౌన్‌లోడ్‌ చేయాల్సి ఉంది. కొలతలు తీసి యాప్‌లో నమోదు చేయడం వల్ల ఆ స్థలానికి ఎంత మొత్తంలో రుసుం చెల్లించాలో లబ్ధిదారుడి ఫోన్‌కు వివరాలు వస్తాయి. ఆ సొమ్ము చెల్లించిన తర్వాత స్థలాన్ని క్రమబద్ధీకరణ చేయనున్నారు. జీవో 59 ప్రకారం క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించేందుకు కలెక్టర్‌ ఇటీవల సంబంధిత అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. యాప్‌లో వివరాలను ఎలా నమోదు చేయాలనే విషయమై కూడా అవగాహన కల్పించారు. 23వ తేదీ నుంచి ప్రత్యేకించి నియమించిన బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి ముమ్మరంగా పరిశీలన చేస్తున్నారు. ఈనెలాఖరు వరకు పరిశీలన పూర్తిచేయనున్నారు.

Read more