యువకుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ABN , First Publish Date - 2022-11-22T00:28:04+05:30 IST
జమ్మికుంట పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ వైన్స్‌లో జరిగిన యువకుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
జమ్మికుంట రూరల్, నవంబరు 21: జమ్మికుంట పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ వైన్స్‌లో జరిగిన యువకుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ పరిధిలోని కొత్తపల్లికి చెందిన మంద సంతోష్ ఆరు నెలల క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం దూరపు బంధువు అయిన జీడి శివకృష్ణ సోదరిని వేధించడం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న శివకృష్ణ, అతడి తండ్రి రవి, బాబాయ్ కుమార్ ఇరువై రోజుల క్రితం సంతోష్‌ను బయటకు పిలిపించి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. వారి మాటలు పెడ చెవిన పెట్టిన సంతోష్ ఇటీవల శివకృష్ణ సోదరిని తనవెంట తీసుకువెళ్లాడు. ఈ విషయమై శివకృష్ణ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎలాగైనా సంతోష్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 16న పోలీస్ స్టేషన్ సమీపంలోని వైన్స్‌లో శివకృష్ణ, అతడి తండ్రి రవి, బాబాయ్ కుమార్ మద్యం సేవిస్తూ ప్లాన్ ప్రకారం సంతోష్‌ను వైన్స్‌కు రప్పించారు. మెడపై కత్తితోపొడిచి, గొంతు కోశారు. తీవ్రంగా గాయపడ్డ సంతోష్ మృతి చెందాడు. సంతోష్ అన్న సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శివకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. శివకృష్ణ తండ్రి రవి, బాబాయ్ కుమార్ పరారీలో ఉన్నారు.
హత్యాయత్నం కేసులో నిందితుడికి ఆరేళ్ల జైలు
గన్నేరువరం, నవంబరు21: మండలంలోని జంగపల్లికి చెందిన వెల్దండి రవీందర్‌కు హత్యాయత్నం కేసులో ఆరేళ్ల జైలు శిక్షను విధిస్తూ అసిస్టెంట్ జడ్జి ఎం అరుణ తీర్పును వెల్లడించినట్లు ఎస్‌ఐ మామిడాల సురేందర్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. జంగపల్లి గ్రామానికి జక్కనపల్లి అశోక్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తాత మృతి చెందడంతో 2022 ఫిబ్రవరి 3వ తేదీన దినకర్మ కార్యక్రమానికి జంగపల్లికి వచ్చాడు. దినకర్మ పూర్తయిన తరువాత అశోక్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వెల్దండి రవీందర్ ఇంట్లోకి చొరబడి అశోక్ కంట్లో కారం చల్లి గొడ్డలితో దాడి చేశాడు. బాధితుడి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విచారణ అనంతరం రవీందదర్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.