తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యమకారులకు పెద్దపీట

ABN , First Publish Date - 2022-09-30T05:19:10+05:30 IST

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్యార్థి ఉద్యమ నాయకుడైన పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకాశమివ్వడం ఇందుకు నిదర్శనమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యమకారులకు పెద్దపీట
బాధ్యతలు స్వీకరిస్తున్న పొన్నం అనిల్‌గౌడ్‌

 జిల్లా గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉంది

 మంత్రి గంగుల కమలాకర్‌

 గ్రంథాలయ చైర్మన్‌గా పొన్నం అనిల్‌గౌడ్‌ బాధ్యతల స్వీకరణ


కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 29: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్యార్థి ఉద్యమ నాయకుడైన పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకాశమివ్వడం ఇందుకు నిదర్శనమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.  జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా అనిల్‌కుమార్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓ పంక్షన్‌హాల్‌లో జరిగిన అభినందన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఒక పార్టీ కాదని, ఒక కుటుంబమని, ఏ సభ్యుడికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. పదవులు వచ్చిన ప్రతి ఒక్కరూ  పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేయాలన్నారు. కేసీఆర్‌కు దేశ భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన ఉందని అందుకే దేశ రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. జిల్లాపై మమకారంతో కరీంనగర్‌ నియోజక వర్గ అభివృద్ధికి వెయ్య కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సాగు, తాగునీటికి కొదువ లేకుండా పోయిందని అన్నారు. కేంద్రం లోని ఢిల్లీ పాలకులు తెలంగాణపై విషం చిమ్మే కుట్రలు చేస్తున్నారని అన్నారు. స్మార్ట్‌సిటీ నిధులతో గ్రంథాలయాన్ని ఐదంతస్తుల భవనంగా, డిజిటల్‌ ఈ లైబ్రరీగా మారుస్తామని చెప్పారు. పొన్నం అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, సహకరించిన మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించి గ్రంథాలయానికి, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకవస్తానని అన్నారు. మేయర్‌ సునీల్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మధు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read more