జొమాటో బాయ్ గంజాయి డెలివరీ
ABN , First Publish Date - 2022-12-15T03:47:02+05:30 IST
హైదరాబాద్‌లో గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న ఓ జొమాటో డెలివరీ బాయ్‌ను తుకారంగేట్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో ఓ యువకుడి అరెస్టు
600 గ్రాముల గంజాయి స్వాధీనం
అడ్డగుట్ట, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న ఓ జొమాటో డెలివరీ బాయ్‌ను తుకారంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందనాదీప్తి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి, మధురానగర్‌కు చెందిన చుంచు నితీష్ చంద్ర (20) జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సాంకేతిక కారణాలతో తన ఐడీ కార్డు బ్లాక్ అవ్వడంతో తోటి ఉద్యోగి గుర్తింపు వివరాలతో ప్రస్తుతం డెలివరీలు చేస్తున్నాడు. అయితే, నితీష్ తన జొమాటో డెలివరీ బ్యాగులో గంజాయిని దాచి గుట్టుగా సరఫరా చేస్తుంటాడు.
ఇందులో భాగంగా తుకారాంగేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రియో పింట్ హోటల్ వద్ద ఓ వ్యక్తికి గంజాయి డెలివరీ ఇచ్చేందుకు వచ్చి బుధవారం పోలీసులకు దొరికాడు. రాహుల్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు గంజాయి పార్శిల్స్ డెలివరీ చేస్తుంటానని నితీష్ విచారణలో చెప్పాడు. ‘చీటా.... ఖలాఖాన్..’ అంటూ రాహుల్ కోడ్ భాషలో పంపిన వివరాల ఆధారంగా నితీష్ గంజాయి డెలివరీ చేస్తుంటాడని డీసీపీ తెలిపారు. గత ఆదివారం కూడా జవహర్‌నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తికి నితీష్ రెండు ప్యాకెట్లు గంజాయి అందజేసినట్టు గుర్తించామన్నారు. నితీష్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ వ్యవహారంలో 20 మంది నిందితులను గుర్తించామని వారిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాహుల్‌ను భువనగిరి పోలీసులు గంజాయి కేసులో గతంలో ఓసారి అరెస్టు చేశారని డీసీపీ తెలియజేశారు.