యాదాద్రి విద్యుత్కేంద్రానికి ఊరట

ABN , First Publish Date - 2022-11-24T04:10:20+05:30 IST

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి ఊరట! ఈ విద్యుత్కేంద్రానికి జారీ చేసిన పర్యావరణ అనుమతులను రద్దు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ.. కేంద్ర పర్యావరణ మదింపు కమిటీ(ఈఏసీ)కి అప్పీలు చేయగా, సానుకూలంగా స్పందించింది.

యాదాద్రి విద్యుత్కేంద్రానికి ఊరట

8 అంశాలతో సమగ్ర అధ్యయనం చేయాలి

9 నెలల్లోగా ఈ కసరత్తు పూర్తి చేయాలి

కేంద్ర పర్యావరణ మదింపు కమిటీ ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి ఊరట! ఈ విద్యుత్కేంద్రానికి జారీ చేసిన పర్యావరణ అనుమతులను రద్దు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ.. కేంద్ర పర్యావరణ మదింపు కమిటీ(ఈఏసీ)కి అప్పీలు చేయగా, సానుకూలంగా స్పందించింది. విద్యుత్కేంద్రానికి సంబంధించి 8 అంశాలతో సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశిస్తూ బుధవారం అదనపు టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌) జారీ చేసింది. ఈ ప్రక్రియ అంతా 9 నెలల్లోపు పూర్తిచేసి, తమకు సమర్పించాలని పేర్కొంది. అంతేకాకుండా తదుపరి పర్యావరణ అనుమతి తీసుకునేలోపు నిర్మాణ పనులు యథావిధిగా చేసుకోవాలని, యంత్రాలు బిగించరాదని స్పష్టం చేసింది. ఇక అమ్రాబాద్‌ పులుల రక్షిత అభయారణ్యం ఈ కేంద్రానికి 10 కిలోమీటర్లలోపు ఉంటే కచ్చితంగా జాతీయ వన్యప్రాణుల మండలి నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలని గుర్తుచేసింది. అయితే ఈ కేంద్రం పులుల అభయారణ్యానికి 14.03 కిలోమీటర్ల దూరంలో ఉందని ఇప్పటికే డీమార్కేషన్‌ చేసి, జెన్‌కో సర్టిఫికెట్‌ కూడా దాఖలు చేసింది. దీంతో ఎన్‌వోసీ అవసరం లేకుండా పోయింది.

అదనపు టీవోఆర్‌ కోసం జారీ చేసిన అంశాలు..

ఇదివరకు 50 శాతం దేశీయ బొగ్గు, 50 శాతం దిగుమతి చేసుకున్న విదేశీ బొగ్గును వాడతారని అనుమతి పొందారు. ప్రస్తుతం 100 శాతం దేశీయ బొగ్గు వాడడం వల్ల ఏ మేరకు కాలుష్యం పెరుగుతుంది? రేడియో ధార్మికత ఎంత పెరుగుతుందనే దానిపై బార్క్‌ నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవాలి.

థర్మల్‌ కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో కాలుష్య ప్రభావంపై అధ్యయనం చేయించాలి.

అమ్రాబాద్‌ అభయారణ్యానికి ప్లాంట్‌ ఎంత దూరంలో ఉందో అటవీ ముఖ్య పర్యవేక్షణాధికారి నుంచి లేఖను సమర్పించాలి.

ఐదేళ్లకు గాను బూడిద నిర్వహణపై అత్యవసర ప్రణాళికను సమర్పించాలి.

థర్మల్‌ ప్లాంట్‌ నుంచి వెలువడే బూడిదను చుట్టుపక్కల ఉన్న సిమెంట్‌ కంపెనీలు తీసుకోవడానికి అంగీకారం తెలిపాయని నివేదించినందున ప్లాంట్‌ నుంచి ఎంత దూరంలో కంపెనీలు ఉన్నాయనే అంశాన్ని తెలిపే మ్యాప్‌ను సమర్పించాలి.

దేశీయ బొగ్గు వినియోగం వల్ల యాష్‌పాండ్‌, కాలుష్య తీవ్రతపై ప్రముఖ ప్రభుత్వ సంస్థ నుంచి సమీక్ష నివేదికను సమర్పించాలి.

ఈ ప్రక్రియ అంతా 9 నెలల్లోపు పూర్తిచేయాలి.

నాలుగు నెలల్లోనే గట్టెక్కుతాం

ఈఏసీ తాజా నిర్ణయంతో సమస్య నుంచి గట్టెక్కుతామని తెలంగాణ జెన్‌కో ధీమా వ్యక్తం చేసింది. డిసెంబరు 1 నుంచి మూడు నెలల పాటు రేడియో ధార్మికతపై అధ్యయనం చేయిస్తున్నామని, దేశీయ బొగ్గు వాడకం వల్ల వాయు కాలుష్యంపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో అధ్యయనం చేయాలని బార్క్‌కు నివేదించామని గుర్తుచేసింది. థర్మల్‌ ప్లాంట్ల కాలుష్యాన్ని కట్టడి చేయడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి వీలుగా రూ.2500 కోట్లతో ఫ్యూయల్‌ గ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌ (ఎఫ్‌జీడీ)ని యాదాద్రిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ఈఏసీ 9 నెలల గడువు ఇవ్వగా.. నాలుగు నెలల్లోనే ప్రక్రియను పూర్తిచేస్తామని పేర్కొంది.

Updated Date - 2022-11-24T04:10:20+05:30 IST

Read more