జైల్లో పెడతారా..? పెట్టుకోండి!
ABN , First Publish Date - 2022-12-02T03:10:24+05:30 IST
హైదరాబాద్/బంజారాహిల్స్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఈడీ, సీబీఐ బెదిరింపులకు భయపడేది లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీవి నీచమైన రాజకీయ ఎత్తుగడలని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి ఆ పార్టీ అడ్డదారిలో ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ
ఈడీ, సీబీఐ బెదిరింపులకు భయపడం.. ఎలాంటి విచారణకైనా సిద్ధం
బీజేపీవి నీచ రాజకీయ ఎత్తుగడలు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈడీ వస్తోంది
మీడియాకు లీకులిచ్చి నేతలకున్న పేరు చెడగొట్టాలని చూస్తే ప్రజలే తిప్పికొడతారు
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజం
హైదరాబాద్/బంజారాహిల్స్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఈడీ, సీబీఐ బెదిరింపులకు భయపడేది లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీవి నీచమైన రాజకీయ ఎత్తుగడలని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి ఆ పార్టీ అడ్డదారిలో ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా ఉండడంతో తొలిసారిగా ఆమె గురువారం మీడియా ముందుకు వచ్చారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఏంచేస్తారో చెప్పి అధికారంలోకి రావాలని.. ప్రత్యర్థి పార్టీలపై ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలనుకోవడం సరికాదని అన్నారు. చైతన్యం కలిగిన తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. ‘‘కక్షసాధింపు చర్యగా నన్ను జైల్లో పెడతారా? పెట్టుకోండి. భయపడేది లేదు. మీరింకా ఏం చేస్తారు? ఉరి ఎక్కిస్తారా? ఎక్కించండి. ప్రజల అండ ఉన్నంత కాలం, వారి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నంత కాలం మాకే ఇబ్బందీ ఉండదు’’ అని కవిత వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సేవను విరమించబోమని, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడం కూడా ఆపబోమని చెప్పారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన బీజేపీని గడగడలాడించిందని, అందుకే టీఆర్‌ఎస్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. వారి కేసులకు భయపడేది లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసి ప్రజల ముందు ఉంచినందుకే తమపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లవుతోందని.. ఈ సమయంలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అడ్డదారిలో అధికారం చేపట్టిందని దుయ్యబట్టారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ వస్తోందన్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఈడీ ఇక్కడికి వచ్చిందని ఆరోపించారు. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని అంత సీరియ్‌సగా తీసుకోవడం లేదని తెలిపారు. దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు. మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. ప్రధాని మోదీ తన పంథా మార్చుకోవాలని సూచించారు. ‘‘నా మీద, మన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీ నీచ రాజకీయ ఎత్తుగడ. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు.
ఉదయం నుంచి హైడ్రామా
లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ప్రస్తావించడంతో గురువారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు 14లోని ఆమె నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. వివిధ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. కవితకు అనుకూలంగా నినాదాలు చేశారు. 4 గంటల పాటు అక్కడ హడావుడి కొనసాగింది.