పిప్పిప్పి.. డుండుండుం!

ABN , First Publish Date - 2022-11-30T03:53:10+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో పెళ్లి బాజాలు మోగనున్నాయి....

పిప్పిప్పి.. డుండుండుం!

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి..

డిసెంబరులో వేలాదిగా వివాహాలు..

మూఢాలతో మూడు నెలలుగా బ్రేక్‌

మాఘ మాసంలో కొన్నే ముహూర్తాలు

ఏప్రిల్‌లో మళ్లీ మూఢం

అందుకే డిసెంబరుకు క్రేజ్‌

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలు

మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు...

అంటూ ఆత్రేయ రాసిన ఈ పాట గుర్తుందా? పెళ్లి చేసుకోబోయే ప్రతిజంటా తప్పనిసరిగా ఈ పాటను ఊహించుకుంటూ డ్యూయెట్‌ పాడుకొంటుంటారు. నా పెళ్లి ఇలా జరగాలి, ఈ డిజైన్‌ నగలు కొనుక్కోవాలి..ఇలా పెళ్లికూతుళ్లు ఊహల్లో విహరిస్తుంటే.. ఫ్రెండ్స్‌కి ఎక్కడ బ్యాచ్‌లర్‌ పార్టీ ఇవ్వాలి? పెళ్లి తర్వాత భార్యను ఏయే ప్రదేశాలకి తీసుకెళ్లాలి? ఇలా రకరకాల ఆలోచనలతో పెళ్లికొడుకులు ప్లాన్లు వేసుకుంటారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభిద్దామా అని కాబోయే జంటలు ఆశ పడుతుంటే.. వారి తల్లిదండ్రులు మాత్రం మూఢం, ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకోకూడదని వారి ఆశలకు సంకెళ్లు వేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మూఢం పోయి మంచి ముహుర్తాలు వస్తాయోనని కళ్లలో కాయలు కాసేలా ఎదురుచూస్తారు. ఇప్పుడు వారి ఎదురుచూపులకు తెరపడింది. నవంబరుతో మూఢం పోతోంది. డిసెంబరు నెల మొత్తం ఇక ‘‘పెళ్లి సందడే’’. వచ్చే నెలలో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో కల్యాణమండపాలకి, ఈవెంట్‌ మేనేజర్లకీ గిరాకీ పెరగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. డిసెంబరు 2 నుంచి భారీ సంఖ్యలో జరగనున్న పెళ్లిళ్లతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడనున్నాయి. డిసెంబరులో కూడా నాలుగైదు మాత్రమే మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, రిసెప్షన్‌ వేడుకలతో మండపాలు కిక్కిరిసిపోనున్నాయి. సాధారణంగా ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగతాయి. అయితే మూడు నెలలుగా మూఢాల కారణంగా ‘మాంగళ్యం తంతునానేనా’కు బ్రేక్‌ పడింది. అక్టోబరు, నవంబరు నెలల్లో మంగళవాయిద్యాల ముచ్చటే లేకుండా పోయింది. నవంబరు నెలాఖరుతో మూఢం ముగియడంతో కొత్త జంటలు వివాహ వేడుకలకు సిద్ధమయ్యాయి.

డిసెంబరు 2 నుంచి 21 వరకే మంచి రోజులున్నాయి. ఆ తర్వాత పుష్యమాసం వస్తుంది. ఆ నెలంతా, అంటే జనవరి రెండో భాగం వరకు మంచి ముహూర్తాలు లేవు. అలాగని మరికొంత కాలం వేచి చూడాలని భావించినా.. 2023 ఫిబ్రవరి, మార్చి నెలల్లో (మాఘ, ఫాల్గుణ మాసాల్లో) కొద్ది సంఖ్యలోనే ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో అంటే ఉగాది తర్వాత చైత్రమాసంలో మళ్లీ మౌఢ్యం వస్తోంది. శుభ ముహూర్తాలు మేలో కానీ ఉండవు. దీంతో డిసెంబరులో అందుబాటులో ఉన్న కొన్ని ముహూర్తాల్లోనే ఎక్కువ మంది పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారని పండితులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే డిసెంబరు 20లోగా వేలాదిగా వివాహాలు జరగనున్నాయని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వర్గాలు అంటున్నాయి. దీంతో కల్యాణ మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల 2 వేలకు పైగా కల్యాణ మండపాలు, 2 వేల వరకు బాంక్వెట్‌ హాళ్లు ఉన్నాయి. ఇవన్నీ పెళ్లిళ్లు, రిసెప్షన్లకు బుక్‌ అయిపోయాయని, కొన్ని మ్యారేజ్‌ హాల్స్‌ ఉదయం ఒకరు, సాయంత్రం మరొకరు బుక్‌ చేసుకోవాల్సినంత రద్దీ ఏర్పడిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నారైలకు డిసెంబరే బెస్ట్‌!

కొవిడ్‌ కారణంగా ప్రవాస భారతీయులు మాతృభూమికి వచ్చేందుకు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. భారత్‌ వస్తే మళ్లీ తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయంతో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు.ఇప్పుడు విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు సడలించారు. పైగా డిసెంబరులో అమెరికాలో క్రిస్మస్‌ సందడి ఉంటుంది. ఎన్నారైలకు ఈ సమయంలో కాస్త తేలిగ్గా సెలవులు దొరుకుతాయి. దీంతో విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన యువతీ యువకులు రెక్కలు కట్టుకుని స్వదేశంలో వాలిపోయి ఓ ఇంటివారవుతున్నారు. దగ్గరి బంధువులు విదేశాల్లో ఉన్న వారు కూడా డిసెంబరు అయితే సౌకర్యంగా ఉంటుందని వివాహాలు నిశ్చయించుకున్నారని సికింద్రాబాద్‌కు చెందిన పురోహితుడు విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు.

-స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2022-11-30T13:18:41+05:30 IST