రైతుల మేలు కోసమే కల్లాలు నిర్మించాం

ABN , First Publish Date - 2022-12-30T03:34:44+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిధులపై కేంద్రంతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రైతుల మేలు కోసమే కల్లాలు నిర్మించాం

ఉపాధి నిధుల వివాదంపై కేంద్రానికి సీఎస్‌ వెల్లడి

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శితో భేటీ

రక్షణ శాఖ కార్యదర్శిని కూడా కలిసిన సోమేశ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిధులపై కేంద్రంతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ కార్యదర్శి శైలేష్‌ కే సింగ్‌తో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో వరి అత్యంత ప్రధానమైన పంట అని, చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కల్లాలు నిర్మించిందని సోమేశ్‌ కుమార్‌ వివరించారు. వీటిపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ కొనసాగుతోంది. ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిబంధనలకు విరుద్ధంగా కల్లాల నిర్మాణానికి వినియోగించిన రూ.150.19 కోట్లు తిరిగి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇటీవల నోటీసు జారీ చేసింది. దీనికి ముందు జూన్‌లో కేంద్రం బృందాలు కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, జనగాం, హన్మకొండ జిల్లాల్లో తనిఖీలు చేపట్టాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిబంధనలకు విరుద్ధంగా కల్లాల నిర్మాణం జరిగినట్లు నివేదిక ఇచ్చాయి. ఈ మేరకు కామారెడ్డి, నల్లగొండ, జనగాం, హన్మకొండ జిల్లాల్లో కల్లాల నిర్మాణం కోసం ఖర్చయిన మొత్తం తిరిగి చెల్లించాలని, లేదంటే దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని రాష్ట్ర విభాగాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమేశ్‌ కుమార్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఏ గిరిధర్‌తో కూడా సోమేశ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూముల సమస్యపై చర్చించారు. ఏఓసీ రోడ్ల మూసివేతకు బదులుగా దాని పరిధిలో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూమిని రాష్ట్రానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. మెహిదీపట్నంలో స్కై వాక్‌ నిర్మాణానికి అనుమతివ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్లు, లింకు రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణకు అవసరమైన మేర రక్షణ శాఖ భూములు కేటాయించాలన్నారు.

Updated Date - 2022-12-30T03:34:45+05:30 IST