‘సీతాఫల్‌మండి’ పట్టించుకోండి.!

ABN , First Publish Date - 2022-11-14T00:07:51+05:30 IST

సికింద్రాబాద్‌ ప్రధాన రైల్వేస్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌ను అధునాతన హంగులతో అభివృద్ధి చేసినా.. అరకొర సదుపాయాలు కల్పించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

‘సీతాఫల్‌మండి’ పట్టించుకోండి.!

రైల్వేస్టేషన్‌లో సమస్యల కూత

మొరాయిస్తున్న లిఫ్ట్‌లు

ఆగని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

బౌద్ధనగర్‌, నవంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ ప్రధాన రైల్వేస్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌ను అధునాతన హంగులతో అభివృద్ధి చేసినా.. అరకొర సదుపాయాలు కల్పించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌కు ప్రత్యేకత ఉంది. ఈ స్టేషన్‌లో పార్కింగ్‌ కోసం విశాలమైన స్థలం ఉంది. నాలుగు ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. రోజూ నలభై ఎంఎంటీఎస్‌ రైళ్లు, 20 పాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ స్టేషన్‌ మీదుగా వెళ్తుంటాయి. రోజూ రెండు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సీతాఫల్‌మండి, తార్నాక వైపు రెండు ఫుట్‌ ఓవర్‌ వంతెనలు, ప్రవేశ ద్వారాలున్నాయి. వృద్ధులు, పిల్లలతో వచ్చే మహిళలు కోసం స్టేషన్‌లో ఇటీవల మూడు లిఫ్ట్‌లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కొద్దిరోజులకే లిఫ్ట్‌లు మొరాయించటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

రిజర్వేషన్‌ కౌంటర్‌ బంద్‌

కరోనా లాక్‌డౌన్‌ ముందు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్‌ కౌంటర్‌ సేవలు అందుబాటులో ఉండేవి. కరోనా సమయంలోనూ కౌంటర్‌ అందుబాటులో ఉండేది. నాచారం, హబ్సిగూడ, తార్నాక, బౌద్ధనగర్‌, వారాసిగూడ తదితర ప్రాంతాల వారు ఈ రైల్వేస్టేషన్‌కు వచ్చి దూరప్రాంతాలకు టికెట్లు రిజర్వేషన్లు చేయించుకునేవారు. కానీ కొద్ది రోజులుగా రిజర్వేషన్‌ కౌంటర్‌ మూసి ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రసుత్తం సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌లకు వెళ్లి టికెట్లు రిజర్వేషన్‌ చేయించుకోవాల్సి వస్తోంది.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ ఇవ్వాలి

సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌ మీదుగా నిత్యం పది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కొన్ని రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లకుండా మల్కాజిగిరి మీదుగా వెళ్తుంటాయి. ప్రసుత్తం అకోలా ఎక్స్‌ప్రె్‌సకు మాత్రమే సీతాఫల్‌మండి స్టేషన్‌లో హాల్ట్‌ ఉంది. ప్లాట్‌ఫామ్‌ చిన్నదిగా ఉండటంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ సదుపాయం కల్పించలేదు. ప్లాట్‌ఫామ్‌ను ఆధునికీకరించి కాచిగూడ-విశాఖపట్నం, సెవెన్‌హిల్స్‌, కాకినాడ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సీతాఫల్‌మండిలో ఆగే సదుపాయం కల్పించాలని ప్రయాణికులు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కనిపించని శుభ్రత

సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు, స్థానిక బస్తీవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు మందుబాబులు ఈ రైల్వేస్టేషన్‌కు వచ్చి స్టేషన్‌ పరిసరాలను అశుభ్రంగా మారుస్తున్నారని తెలిపారు. లిఫ్ట్‌లు, ప్లాట్‌ఫామ్‌లపైన గుట్కాలు నమిలి ఉమ్మేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. స్థానికంగా ఉండే కొంతమంది ఆకతాయి పిల్లలు రోజంతా లిఫ్ట్‌లు ఎక్కి దిగుతుండడంతో అవి మొరాయిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

Updated Date - 2022-11-14T00:07:53+05:30 IST