ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అవిభక్త కవలలు వీణ, వాణి
ABN , First Publish Date - 2022-06-29T02:28:32+05:30 IST
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అవిభక్త కవలలు వీణ, వాణి

Hyderabad: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణ, వాణి సత్తా చాటారు. ఇద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. సీఈసీ కోర్సు అభ్యసించిన వీణ 712, వాణి 707 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వీణ, వాణిలను అభినందించారు. వీణ, వాణిలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వారి ఉన్నత చదువుకు, భవిష్యత్‌లో వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వీణ – వాణిల చదువుకు సహకరించిన అధికారులను మంత్రి రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు.
టెన్త్‌లోనూ వీణ, వాణిలు ప్రతిభ కనపర్చారు. ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు. కాగా, గతంలో వీణా వాణీ తాము భవిష్యత్తులో ఇంజినీర్, సైంటిస్ట్ కావాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న వీరి బాగోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటోంది. పుట్టినప్పటి నుంచి నీలోఫర్ ఆసుపత్రిలోనే ఎక్కువ కాలం గడిపారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన మారగాని మురళి, నాగలక్ష్మికి ఈ అవిభక్త కవలలు 16 అక్టోబర్, 2006న జన్మించారు. ఆపరేషన్ చేసి వీణా-వాణీలను విడదీయాలని ప్రభుత్వానికి తండ్రి మురళి గతంలో విజ్ఞప్తి చేశారు. వీణా-వాణీలకు మెదడు, రక్త కణాలు కలిసి ఉండటం వల్ల శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు వైద్య నిపుణులు సమాలోచనలు జరిపారు.
నల్లగొండ జిల్లా సూర్యపేటలోని విజయకృష్ణ నర్సింగ్ హోమ్‌లో ఈ కవలలు జన్మించారు. నర్సింగ్ హోం నిర్వాహకురాలు డాక్టర్ విజయ వీరిని గుంటూరులోని డాక్టర్ నాయుడమ్మ దగ్గర చూపించాలని రెఫర్ చేశారు. వీణవాణిలను ఆయన పరీక్షించారు. వీణ-వాణిల తలలు పూర్తిగా అంటుకుని ఉండకుండా చర్మం పొరను విడదీసీ మళ్లీ కలవకుండా శస్త్రచికిత్స చేశారు. మరోసారి శస్త్రచికిత్స చేసి విడదీసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రెండున్నరేళ్లు గుంటూరులోనే డాక్టర్ నాయుడమ్మ దగ్గర ఉన్నారు. ఆ తర్వాత నాయుడమ్మ రిటైర్ అయ్యారు. తర్వాత కవలలను గుంటూరు నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు పలు దేశాల వైద్యులు రావడం, పరీక్షలు నిర్వహించడం అప్పటి నుంచి కొనసాగుతోంది. 2008లో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే మూడు నెలలు ఉన్నారు. డాక్టర్ ఆశిష్‌మెహతా పరిశీలించారు. శస్త్ర చికిత్సకు అవసరమైన వైద్య పరీక్షల కోసం చెన్నైకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్సకు రూ.8 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. శస్త్ర చికిత్స చేస్తే వీణ-వాణిల ప్రాణానికి భరోసా ఇవ్వలేమని, ఒకరే బతికే అవకాశం ఉందని చెప్పారు. అక్కడి నుంచి మళ్లీ నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. సింగపూర్‌కు చెందిన డాక్టర్ కీత్‌గో వచ్చి పరిశీలించారు. శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు. ఎయిమ్స్‌లోనే చేయాలని ప్రభుత్వం భావించింది. అప్పటి నుంచి వివిధ దేశాల వైద్యులు వచ్చి పరిశీలించి వెళ్తున్నారు. చివరకు అవిభక్త కవలలను వేరుచేయడానికి లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ర్టీట్ ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీ నీలోఫర్ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. వైద్య రిపోర్టులను నిశితంగా పరిశీలించి, వీణా-వాణీలను పరీక్షించారు. గతంలో అవిభక్త కవలలుగా జన్మించిన ముగ్గురిని శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా వేరు చేసిన అనుభవంతో.. వీణి, వాణిలను కూడా ఆపరేషన్ చేసి వేరు చేస్తామని చెప్పారు. అయితే ఆపరేషన్ లండన్‌లోనే చేయాల్సి ఉంటుందని, అదికూడా నాలుగైదు దశల్లో చేయాలని వైద్యులు పేర్కొన్నారు. కాగా శస్త్రచికిత్సకు అవసరమైన సాయాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇలా ఎంత మంది వైద్యులు పరిశీలించినా... శస్త్రచికిత్స ఎప్పుడనేది కచ్చితంగా ఎవరూ చెప్పడంలేదు. అయితే శస్త్ర చికిత్స చేయడం ద్వారా ఇద్దరు చిన్నారులు బతకాలని వైద్యబృందం, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.