ఆపరేషన్‌ ‘రోప్‌’

ABN , First Publish Date - 2022-09-30T17:20:22+05:30 IST

నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు పోలీస్‌ కమిషనర్‌ సహా ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ సమస్యను అధిగమించడంతోపాటు

ఆపరేషన్‌ ‘రోప్‌’

ట్రా‘ఫికర్‌’కు చెక్‌ పెట్టడమే లక్ష్యం

పోలీసుల సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌

అక్రమ పార్కింగ్‌లు, ఫుట్‌పాత్‌

ఆక్రమణల తొలగింపునకు ప్రాధాన్యం

ట్రాఫిక్‌ విభాగానికి సిబ్బంది పెంపు 

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించిన సీపీ సీవీ ఆనంద్‌


హైదరాబాద్‌ సిటీ: నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు పోలీస్‌ కమిషనర్‌ సహా ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు.  ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ సమస్యను అధిగమించడంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వ్యూహాత్మక చర్యలకు సిద్ధమయ్యారు. జాతీయ రహదారులతో నగరానికి కనెక్ట్‌ అవుతున్న రోడ్లు, నగరంలోని అంతర్గత రహదారుల కబ్జా, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనతోనే ప్రధాన సమస్యలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అందుకోసం ఆపరేషన్‌ ‘రోప్‌’ పేరిట కార్యాచరణ ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ట్రాఫిక్‌ యాక్షన్‌ ప్లాన్‌పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రోడ్‌ మ్యాప్‌, 3 గోల్డెన్‌ ‘ఇ’లు, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోప్‌ (రిమూవల్‌ ఆఫ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎన్‌క్రోచ్‌మెంట్స్‌)కు సంబంధించిన వివరాలు సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఏడాది వ్యవధిలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించాలనే లక్ష్యంతో ప్రణాళికలు తయారు చేసినట్లు వివరించారు.


రెండేళ్లలో కొవిడ్‌ తీవ్రత కారణంగా నగరంలో వ్యక్తిగత వాహనాలు 18 శాతం పెరిగాయని.. దాంతో ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయన్నారు. 2019లో వాహనాల సంఖ్య 64 లక్షలు ఉండగా.. ప్రస్తుతం నగరంలో 77.65 లక్షల వాహనాలు(అన్ని రకాలు కలిపి) తిరుగుతున్నాయన్నారు. అదే స్థాయిలో ట్రాఫిక్‌ సమస్యలపై డయల్‌ 100కు కాల్స్‌ కూడా పెరిగాయన్నారు. అనంతరం ట్రాఫిక్‌ పోలీసుల లోగోను సీపీ ఆవిష్కరించారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌, డీసీపీ కరుణాకర్‌, అదనపు సీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు పాల్గొన్నారు. 


యాక్షన్‌ ప్లాన్‌ ఇలా..

 రోప్‌ (రిమూవల్‌ ఆఫ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎన్‌క్రోచ్‌మెంట్స్‌) కార్యాచరణను పోలీసులు ఇప్పటికే ప్రారంభించారు. రోడ్లపై, షాపింగ్‌మాల్స్‌, రెస్టారెంట్స్‌ వద్ద అక్రమ పార్కింగ్‌ నివారణ, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగింపువంటి, తోపుడు బండ్లు, ఇతర ట్రాఫిక్‌ అడ్డంకులుగా రోడ్లపై ఉన్న వాటి తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి. 

 ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న వాహనాలను ఎప్పటికప్పుడు తొలగించడానికి టోయింగ్‌ వాహనాలను రెట్టింపు చేశారు.  

 అపార్ట్‌మెంట్లలో ఉంటున్న వారి వాహనాలను రోడ్లపై పార్క్‌ చేయరాదని, అపార్ట్‌మెంట్‌ నిర్మాణాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో 60శాతం, హోటల్స్‌, లాడ్జీలు, వాణిజ్య భవనాల్లో 40శాతం, అపార్ట్‌మెంట్లు, విద్యా సంస్థల్లో 30 శాతం స్థలం పార్కింగ్‌కు కేటాయించాలనే నిబంధన ఉందని వివరించారు. స్కూళ్లు, వ్యాపార వర్గాలతో పార్కింగ్‌ ఏర్పాట్ల విషయమై చర్చలు జరపనున్నారు.

ట్రాఫిక్‌ అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం సమయంలో ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీతో సహా డీసీపీలు, ఏసీపీలు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై దృష్టిసారిస్తారు.

 రోడ్లపై వాహనాల స్టాప్‌లైన్‌ నిబంధన, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, నెంబర్‌ప్లేట్లు సరిగా లేని వాహనాలు, ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌, సీటు బెల్ట్‌ లేకపోతే, కార్లకు బ్లాక్‌ ఫిలింలు ఉంటే చర్యలు తీసుకుంటారు. 

 బస్‌లను బస్టాపుల్లోనే నిలిపేలా చర్యలు, బస్‌ బేలు ఏర్పాటు చేసి వాటిని పక్కాగా అమలు చేసేలా ఆర్టీసీ డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్‌కు అడ్డంకులుగా మారకుండా చర్యలు తీసుకుంటారు. అవసరమైనచోట బస్టా్‌పలు మార్చడంపై  అధికారులతో చర్చిస్తారు. ఆటోడ్రైవర్లు, ఇతర రోడ్లపై తిరిగే స్కూల్‌ బస్సులు, ఇతర వాహనాలను కూడా రోడ్లపై స్టాపులు, పార్కింగ్‌ వల్ల కలిగే ఇబ్బందుల గురించి అవగాహన కల్పించి వాటిని నివారించేందుకు చర్యలు. 

 3 ‘ఇ’ నుంచి 4 ‘ఇ’: ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంజనీరింగ్‌, ఎడ్యుకేషన్‌తోపాటు ఎనేబుల్‌మెంట్‌ అనే మరో ‘ఇ’ జోడిస్తున్నట్లు సీపీ ప్రకటించారు. 

 ప్రతి వారం తొలిరోజు జాయింట్‌ సీపీ నుంచి హోంగార్డు వరకు రోడ్లపై ఉండి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తారు.  

 జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌లను నివారించడానికి సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి ఫ్రీ లెఫ్ట్‌ సక్రమంగా వినియోగించేలా చర్యలు, యూ టర్న్‌ల వద్ద సేఫ్‌ టర్నింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు. 

షార్ట్‌ఫిలింలు, సోషల్‌మీడియా ద్వారా కూడా ట్రాఫిక్‌ నిబంధనలు.. అమలు గురించి అవగాహన కల్పించనున్నారు. 

ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ సిబ్బందికి అదనంగా 40 మంది ఎస్‌ఐలు, 100 మంది హోంగార్డులను కేటాయించనున్నట్లు సీపీ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. 

Read more