డిపాజిట్ల పేరిట టోకరా

ABN , First Publish Date - 2022-12-31T04:48:38+05:30 IST

‘డబ్బులు ఎవరికి ఊరికే రావు’.. అని ఓ బంగారం దుకాణం ఆయన గొంతుచించుకుని ప్రచారం చేసినా కొందరు అర్థం చేసుకోలేదు.

డిపాజిట్ల పేరిట టోకరా

2 వేల మందిని ముంచిన ఎన్‌బీ ఫైనాన్స్‌ యాప్‌

రూ.50వేల నుంచి రూ.2లక్షల దాకా డిపాజిట్లు.. రోజుకింత తిరిగిస్తామని హామీ

అకస్మాత్తుగా యాప్‌ బంద్‌..3కోట్ల మేర బురిడీ

జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌), డిసెంబరు 29 : డబ్బులు ఎవరికి ఊరికే రావు’.. అని ఓ బంగారం దుకాణం ఆయన గొంతుచించుకుని ప్రచారం చేసినా కొందరు అర్థం చేసుకోలేదు. గుర్తు తెలియని వారెవరో సోషల్‌ మీడియాలో ఓ లింక్‌ పంపి మీరు రూపాయి ఇస్తే మేము రూ.2 తిరిగిస్తామని అంటే వలలో పడిపోయారు. ఆ సైబర్‌ నేరగాళ్లను గుడ్డిగా నమ్మేసి కష్టపడి సంపాదించిన డబ్బును అత్యాశతో ఓ యాప్‌లో పెట్టేశారు. చివరికి ఆ యాప్‌ నిర్వాహకులు దుకాణం సర్దేయగా బాధితులు నెత్తిన తడిగుడ్డ వేసుకోని లబోదిబోమంటున్నారు. ఎన్‌బీ ఫైనాన్స్‌ పేరిట జరిగిన ఈ ఆన్‌లైన్‌ మోసం సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. రూ. 3 కోట్లకు పైగా సొమ్ము సైబర్‌ నేరగాళ్ల పాలైంది. దాదాపు రెండు వేల మంది మోసపోగా వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే ఉండటం గమనార్హం.

మోసం ఇలా జరిగింది...

గజ్వేల్‌కు చెందిన కొందరు యువకులకు ఎన్‌బీ ఫైనాన్స్‌ పేరుతో అక్టోబరు నెల ప్రారంభంలో వాట్సా్‌పలో ఓ యాప్‌ లింక్‌ వచ్చింది. ఆ లింక్‌ ఓపెన్‌ చేయగా.. తమ యాప్‌లో రిజిస్టర్‌ అయ్యి డబ్బు పెట్టుబడి పెడితే ఆ మొత్తానికి మరికొంత అదనంగా చేర్చి రోజుకి ఇంత చొప్పున 50 రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని ఉంది. ఉదాహరణకు యాప్‌లో రూ.500 డిపాజిట్‌ చేస్తే రోజుకు రూ.17చొప్పున 50 రోజుల్లో రూ.850 తిరిగి చెల్లిస్తారు. ఆ డబ్బంతా యాప్‌లోని వినియోగదారుని వ్యక్తిగత ఖాతాలో జమవుతుంది. నగదు డిపాజిట్‌ చేసిన 24 గంటల తర్వాత నుంచి ఈ చెల్లింపులు ప్రారంభమవుతాయి. దీనిపై ఏమైనా అనుమానాలుంటే సంప్రదించేందుకు వాట్సాప్‌ లింక్‌ కూడా యాప్‌లో ఇచ్చారు. ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే ఎన్‌బీ డాన్నా అనే పేరుతో పేజ్‌ ఓపెన్‌ అయ్యేది. చాట్‌ రూపంలో సందేహాలు అడిగితే అవతలి వారు నివృత్తి చేసేవారు. దీంతో ఆకర్షితులైన యువకులు తొలుత రూ.500 డిపాజిట్‌ చేశారు. 24 గంటల తర్వాత రూ.17 ఖాతాలో క్రెడిట్‌ అయ్యాయి. ఇలా ప్రతీ రోజు జరుగుతుండటంతో 50 రోజుల గడువు ముగియకముందే రూ.1000 డిపాజిట్‌ చేశారు.

దీంతో అక్టోబరు చివరి వారానికి వచ్చేసరికి గ్రామానికి చెందిన వెయ్యి మంది ఈ యాప్‌లో చేరారు. ప్రతి రోజు రిటర్న్స్‌ ఖాతాలో కనిపిస్తుడటంతో ఆ యాప్‌ను నమ్మిన వారంతా ఇతరులను కూడా ఈ ఊబిలోకి లాగారు. ఇలా మర్కుక్‌ మండలం పాతూర్‌తోపాటు పాములపర్తి, ఇప్పలగూడెం గ్రామాలకు చెందిన యువకులు కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో యాప్‌ నిర్వాహకులు ఎన్‌బీ వీఐపీ యాక్టివేషన్‌ పేరుతో ఓ కార్డును తీసుకొచ్చారు. రూ.6,600 పెట్టి ఆ కార్డు కొనుగోలు చేసిన వారికే రిటర్న్స్‌ వస్తాయని స్పష్టం చేశారు. అప్పటికే ఈ యాప్‌ మాయలో పూర్తిగా పడిపోయిన కొందరు ఆ కార్డును కూడా కొన్నారు. అనంతరం డిసెంబరు మొదటి వారంలో కొత్త ఆఫర్‌ను ప్రకటించారు. రూ.50వేలు అంతకంటే ఎక్కువ డబ్బు డిపాజిట్‌ చేస్తే పది రోజుల్లో భారీ లాభంతో రిటర్న్‌ ఇస్తామని ఆశచూపారు. దీంతో కొందరు రూ.50వేల నుంచి రూ.2 లక్షల దాకా డిపాజిట్లు చేశారు. డిసెంబరు 15వచ్చేసరికి ఈ స్కీమ్‌ కింద రూ.కోటికి పైగా డిపాజిట్లు జరిగాయి. అలాగే గజ్వేల్‌, దౌల్తాబాద్‌, రాయపోల్‌కు చెందిన వారు కూడా యాప్‌లో డిపాజిట్లు చేశారు. డిసెంబరు 25 నుంచి యాప్‌లో లావాదేవీలు ఆగిపోయాయి. 27న కొందరు వాట్సాప్‌ ద్వారా నిర్వాహకులతో మాట్లాడితే సరైన స్పందన రాలే దు. 28న మొత్తానికి యాప్‌ మూతపడింది. ఎట్టకేలకు మోసాన్ని గుర్తించిన బాధితులు తెలియక లబోదిబోమంటున్నారు. మొత్తంగా ఎన్‌బీ ఫైనాన్స్‌ పేరిట రూ.3 కోట్లకు పైగా మోసం జరిగినట్టు ప్రాథమిక సమాచారం.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం...

ఎన్‌బీ ఫైనాన్స్‌ పేరుతో జరిగిన సైబర్‌ క్రైమ్‌ తమ దృష్టికి రాలేదని గజ్వేల్‌ సీఐ వీరప్రసాద్‌ తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-31T04:48:38+05:30 IST

Read more