Hyderabad: కళ్లల్లో కారం కొట్టి దారి దోపిడీ

ABN , First Publish Date - 2022-12-07T12:15:55+05:30 IST

కొరియర్‌ ద్వారా వివిధ ప్రాంతాలకు పంపించేందుకు రూ. 27.12 లక్షల విలువ చేసే

Hyderabad: కళ్లల్లో కారం కొట్టి దారి దోపిడీ

రూ.27.12 లక్షల విలువైన సొత్తు అపహరణ

హైదరాబాద్/రాంగోపాల్‌పేట్‌: కొరియర్‌ ద్వారా వివిధ ప్రాంతాలకు పంపించేందుకు రూ. 27.12 లక్షల విలువ చేసే బంగారం బిస్కెట్లు, డైమండ్‌ నెక్లెస్‌ను తీసుకు వస్తున్న యువకుడి కళ్లల్లో కారం కొట్టి, కత్తితో దాడి చేసి దోపిడీ చేశారు. ఈ ఘటన మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్‌ మారేడ్‌పల్లి రైల్వే కాలనీకి చెందిన సతీష్‌కుమార్‌ పాట్‌ మార్కెట్‌లో జై మాతా లాజిస్టిక్‌ పేరుతో కొరియర్‌ సర్వీస్‌ నిర్వహిస్తూ బంగారాన్ని సరఫరా చేస్తుంటాడు. సోమవారం రాత్రి సతీష్‌ కుమార్‌ వద్ద కొరియర్‌ బాయ్‌గా పని చేసే పవన్‌కుమార్‌ సైనీ జీరాలోని శ్రీ జై అంబే కొరియర్స్‌ నుంచి రూ.8.65 లక్షల విలువ చేసే 80 గ్రాముల బంగారు బిస్కెట్లను, హిమాయత్‌నగర్‌లోని శ్రీ రాదే డైమెండ్స్‌ నుంచి రూ.18.47,472 విలువ గల 148.492 గ్రాముల డైమెండ్‌ నెక్లెస్‌ను తీసుకుని తన హోండా యాక్టివాపై కర్బలా మైదాన్‌, బైబిల్‌ హౌస్‌ల మీదుగా పాట్‌ మార్కెట్‌కు వస్తున్నాడు. రాత్రి 9.45 సమయంలో బైబిల్‌ హౌస్‌ సమీపంలోకి రాగానే పల్సర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పవన్‌కుమార్‌ కళ్లల్లో కారం చల్లారు.

అప్రమత్తమైన బాధితుడు తన వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. సిటీ లైట్‌ చౌరస్తా సమీపంలోకి రాగానే ముందున్న ఆటోను ఢీ కొని పడిపోయాడు. అప్పటికే పవన్‌కుమార్‌ను వెంబడిస్తున్న దుండగులు అతని వద్ద ఉన్న బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నించగా, ప్రతిఘటించాడు. దుండగుడు కత్తితో పవన్‌కుమార్‌ చేతిపై దాడి చేసి బ్యాగు లాక్కొని పారిపోయారు. ఇదంతా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వాహనాల మధ్యలో క్షణాల్లో జరిగిపోయింది. పవన్‌కుమార్‌ తన యజమాని సతీష్‌కుమార్‌కు జరిగిన ఘటనను ఫోన్లో వివరించాడు. మహంకాళి పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. నార్త్‌ జోన్‌ డీసీపీ చందనా దీప్తి, మహంకాళి ఏసీపీలు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా దుండగులు సిటీలైట్‌ చౌరస్తా నుంచి చిత్ర దర్గ, జనరల్‌ బజార్‌, కలాసీ గుడా, ఎస్పీ రోడ్డు, సెంట్‌ జాన్స్‌ రోటరీల మీదుగా ఏఓసీ వైపు వెళ్లినట్లు గుర్తించారు. సతీష్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు ఆరు ప్రత్యేక బృందాలు కేసు దర్యాప్తు చేస్తున్నాయి.

Updated Date - 2022-12-07T12:15:58+05:30 IST