స్పెషల్‌ బాదుడు

ABN , First Publish Date - 2022-07-05T16:13:09+05:30 IST

కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లలో దోపిడీ పర్వం కొనసాగుతోంది. అడ్మిషన్ల సమయంలోనే సుమారు 30 శాతం ఫీజులు పెంచగా, ఇప్పుడు కొత్త రకం

స్పెషల్‌ బాదుడు

 ప్రైవేట్‌ స్కూళ్ల నయా దోపిడీ

 పాఠశాలలు తెరిచి నెలకాక ముందే బాదుడు

 ట్యూషన్‌, ప్రత్యేక ఫీజుల పేరిట వసూళ్లు

 కట్టాలంటూ తల్లిదండ్రులకు సందేశాలు


హైదరాబాద్‌ సిటీ: కొన్ని ప్రైవేట్‌  స్కూళ్లలో దోపిడీ పర్వం కొనసాగుతోంది. అడ్మిషన్ల సమయంలోనే సుమారు 30 శాతం ఫీజులు పెంచగా, ఇప్పుడు కొత్త రకం ఫీజులను జత చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేస్తూ తల్లిదండ్రుల జేబులను గుల్ల చేస్తున్నాయి. అడ్మిషన్‌ మొదలుకొని నెలవారీ ఫీజుల వరకు అన్నింటిలో 25 నుంచి 30 శాతం పెంచడంతో సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.


రెండు రకాల ఫీజులు

పురానాపూల్‌కు చెందిన మహేష్‌ కుమార్తె ప్రణతి నానల్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. మూడో తరగతిలో నెలకు రూ. 1,200 ఫీజు తీసుకున్న యాజమాన్యం.. నాలుగో తరగతిలో ట్యూషన్‌ ఫీజు రూ. 1,525 నిర్ణయించింది. ఇప్పుడు స్పెషల్‌ ఫీజు కింద మరో రూ. 1,500 జోడించింది. జూన్‌, జూలై ట్యూషన్‌ ఫీజు రూ.1525+1525తోపాటు స్పెషల్‌ ఫీజు రూ.1500, మొత్తం రూ.4,550 కట్టాలని ఇటీవల ప్రణతికి స్లిప్‌ ఇవ్వడంతో ఆమె తండ్రి మహేష్‌ అవాక్కయ్యాడు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కౌశల్‌ అనే విద్యార్థికి రూ.7,500 తీసుకురావాలని స్లిప్‌ ఇవ్వడం గమనార్హం.


పుస్తకాలపై అదనపు భారం

మెహిదీపట్నంలో ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో నాలుగో తరగతి హిందీ పుస్తకం 2022లో రూ.132 ఉండగా.. ప్రస్తుతం రూ.235కి విక్రయిస్తున్నారు. ఇంగ్లిష్‌ బుక్‌ రూ. 145 ఉండగా.. రూ. 245కి అమ్ముతున్నారు. 


ఫీజులను నియంత్రించాలి 

కరోనా తర్వాత చాలా పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అధికమైంది. మార్చిలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఏటా స్కూల్‌ ఫీజుల పెంపు 10 శాతం మించకూడదని స్పష్టం చేసింది. ప్రతి పాఠశాలలో ఫీజుల నియంత్రణ కమిటీ వేయాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధిక ఫీజులను నియంత్రించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తాం.

- జావిద్‌, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి 

Read more