రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట

ABN , First Publish Date - 2022-12-30T03:41:37+05:30 IST

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

కార్మికుల పక్షపాతి కేసీఆర్‌: హరీశ్‌రావు

కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

మంచిర్యాల/ఆసిఫాబాద్‌/సుభా్‌షనగర్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం రూ.17 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. జిల్లాకో మెడికల్‌ కళాశాల, డయాలసిస్‌ సెంటర్‌ను మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. డయాలసిస్‌ సేవలందించేందుకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తరహాలో తమ రాష్ట్రంలోనూ డయాలసిస్‌ సేవలందిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం ఐదు మెడికల్‌ కాలేజీలుంటే తాము వాటిని 17కు పెంచామని, 2023 విద్యాసంవత్సరంనాటికి 25 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. విస్తృతంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణలో వైద్య విద్య ప్రస్తుతం పేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

పర్‌ క్యాపిటా, ఎంబీబీఎస్‌ సీట్లలో ప్రథమ స్థానం, పోస్టు గ్రాడ్యుయేషన్‌ సీట్లలో రెండో స్థానం, వైద్య సేవలందించడంలో తృతీయ స్థానంలో తెలంగాణ నిలిచిందని నీతి అయోగ్‌, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తెలిపిందని మంత్రి వివరించారు. సింగిల్‌ ఇంజన్‌ అయిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుండగా, దేశంలోని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లు ట్రబుల్‌ ఇంజన్లు అయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌లు జారీ చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తుంటే, కేంద్ర సర్కార్‌ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉద్యోగాలను ఊడగొడుతోందని ఆయన ఆరోపించారు. ఎల్‌ఐసీ, బీఎ్‌సఎన్‌ఎల్‌, రైల్వేలతోపాటు సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే యత్నం చేస్తోందన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి అని, కార్మికులు సైతం కేసీఆర్‌ వెన్నంటి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

కోనప్ప స్ఫూర్తితోనే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లకు శ్రీకారం

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కార్యక్రమానికి సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్ఫూర్తి అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో నిర్మించిన 30 పడకల సామాజిక ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. న్యూట్రిషన్‌ కిట్లు ప్రారంభించక ముందే పోషకాహార లోపాన్ని గుర్తించి కోనప్ప పెద్దఎత్తున వీటిని మహిళలకు పంపిణీ చేశారని కొనియాడారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రిని మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనవెంట మంత్రి గంగుల కమలాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌,పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-30T03:41:38+05:30 IST