బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం ఖాయం

ABN , First Publish Date - 2022-12-31T04:26:51+05:30 IST

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం ఖాయమని, రోజులు దగ్గర పడ్డాయని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా బీజేపీదేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం ఖాయం

పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచైనా పోటీ చేస్తా

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిరగబడాలి: ఈటల

కమలాపూర్‌, డిసెంబరు 30: బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం ఖాయమని, రోజులు దగ్గర పడ్డాయని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా బీజేపీదేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో శుక్రవారం జరిగిన మండల బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలల్లో ఎక్కడ నుంచైనా నిలబడతానన్నారు. ప్రజలు మెచ్చే ప్రభుత్వాన్ని తీసుకు రావడమే తన కర్తవ్యమన్నారు. ప్రజలను మోసం చేసి, వంచిస్తున్న వారే గొప్ప నాయకుల్లాగా చలామణి అవుతున్నారని అన్నారు. ఈ సంస్కృతిని ఆపలేకపోతే చీకటి రోజులు వస్తాయన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల కారణంగా యువత పెడదారి పడుతోందని, వీటిని అరికట్టాల్సిన పోలీసులు ఆ పని చేయడంలేదన్నారు. ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలను కొట్టి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్‌ ఉత్సవ విగ్రహాల్లాగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేయాలన్నారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో లాంగ్‌ జంప్‌ ఈవెంట్‌ను 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర మంత్రులు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

Updated Date - 2022-12-31T04:26:51+05:30 IST

Read more