పుస్తకం మురిసింది..

ABN , First Publish Date - 2022-12-24T23:42:14+05:30 IST

భిన్న అభిరుచులకు, విభిన్న ఆలోచనలకు కూడలి అయిన హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ప్రాంగణం శనివారం సందర్శకులతో కిక్కిరిసింది.

పుస్తకం మురిసింది..

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 24(ఆంధ్రజ్యోతి): భిన్న అభిరుచులకు, విభిన్న ఆలోచనలకు కూడలి అయిన హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ప్రాంగణం శనివారం సందర్శకులతో కిక్కిరిసింది. క్రిస్మస్‌ సెలవులు కావడంతో బాలలు, యువత పెద్దసంఖ్యలో పుస్తకాల చెంతకు బారులుదీరారు. గిలిగింతలు పెట్టే చలిలోనూ సాహిత్య ప్రియులంతా నులివెచ్చని పుస్తకాల లోగిళ్ళలో సేదతీరారు. పుస్తకావిష్కరణలు, పుస్తక పరిచయ సభలు, రచయితతో సంభాషణ తదితర కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.

  • నారపరాజు కిషోర్‌కుమార్‌ ‘మార్పు’, ‘గ్రామ ప్రకాశం’ నవలలను శనివారం అలిశెట్టి ప్రభాకర్‌ సాహిత్య వేదికపై ప్రముఖ సాహిత్య విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి ఆవిష్కరించారు. కవి ఆనందాచారి పుస్తక సమీక్ష చేశారు.

  • తెలంగాణ బుక్‌ట్రస్ట్‌ స్టాల్‌ - 200ను పర్యావరణ వేత్త వేదకుమార్‌, బుక్‌ ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ శనివారం ప్రారంభించారు. తెలంగాణ సాహిత్యం, చరిత్ర తదితర పుస్తకాలతో పాటు ఉద్యోగార్థులకు ఉపయుక్తమయ్యే పుస్తకాలను తెలంగాణ బుక్‌ ట్రస్ట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ప్రచురణకర్త కోయ చంద్రమోహన్‌ను వక్తలు కొనియాడారు.

  • హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.గోపాలరావును ప్రస్తుత కార్యనిర్వాహక వర్గం సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన బుక్‌ ఫెయిర్‌ డైరెక్టరీని ఆవిష్కరించారు.

  • బూర్ల వెంకటేశ్వర్లు ‘ఉపకారి’ తెలంగాణ భాషానుశీలన వ్యాసాల సంపుటి ఆవిష్కరణ సభ శనివారం జరిగింది. కార్యక్రమంలో సంగిశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • శ్రీలేఖ కలువకుంట రచించిన ‘యూనిక్‌ థింకింగ్‌’ పుస్తక పరిచయ కార్యక్రమం జరిగింది.

వైద్యవిద్యలో భారత్‌ తక్కువ కాదు

ప్రఖ్యాత వైద్యుడు నోరి దత్తాత్రేయుడు

తాను స్వీయచరిత్రనే ‘ఒదిగిన కాలం’ పుస్తకంగా తీసుకొచ్చినట్లు ప్రముఖ కేన్సర్‌ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. మన దేశంలోని వైద్య విద్య, వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి మిగతా దేశాలకంటే ఏమాత్రం తీసిపోదని తెలిపారు. తనకు వైద్యవిద్యను బోధించిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు కుటుంబ విలువలను పెంపొందించడం, మన దేశ వైజ్ఞానిక శాస్త్ర ఔన్నత్యాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం కోసం తాను ఈ పుస్తకం రాసినట్లు వివరించారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ శనివారం నోరి దత్తాత్రేయుడు స్వీయకథ ‘ఒదిగిన కాలం’పై సంభాషణ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ కేన్సర్‌పై తాను చేసిన పరిశోధనల గురించి ఆత్మకథలో ప్రస్తావించినట్లు తెలిపారు. కేన్సర్‌ చికిత్సలో తాను ప్రవేశపెట్టిన కొత్త పద్ధతుల గురించి ప్రస్తావించారు. కార్యక్రమానికి కొండ నాగేశ్వర్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

Updated Date - 2022-12-24T23:43:56+05:30 IST