యోగా, కరాటే పేరుతో తీవ్రవాద శిక్షణ!
ABN , First Publish Date - 2022-12-31T03:56:31+05:30 IST
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)లో క్రియాశీలకంగా పని చేసిన 11 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
పీఎఫ్‌ఐ కేసులో 11మందిపై ఎన్‌ఐఏ చార్జిషీట్
హైదరాబాద్/న్యూఢిల్లీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)లో క్రియాశీలకంగా పని చేసిన 11 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు. నిషేధిత సంస్థ కోసం రిక్రూట్‌మెంట్, ఉగ్రవాద శిక్షణ క్యాంపులు నిర్వహించారన్న ఆరోపణలపై నిజామాబాద్ జిల్లా 6వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గత జూలై 4న నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్‌ఐఏ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు వరుస దాడులు నిర్వహించాయి. హైదరాబాద్‌లోని పీఎ్‌ఫఐ కార్యాలయాన్ని సీజ్ చేసి.. పలువురిని అరెస్ట్ చేశాయి. తాజాగా ఈ కేసులో తెలంగాణకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్కరిపై చార్జిషీట్ దాఖలు చేశాయి. నిందితుల్లో అబ్దుల్ ఖాదర్, అబ్దుల్ అహద్, అబ్దుల్ సలీం, షేక్ షాదుల్లా, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్, సయ్యద్ యాహియా సమీర్, షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ ఖురేషీ, మహ్మద్ అబ్దుల్ ముబీన్, మొహమ్మద్ ఇర్ఫాన్ తెలంగాణకు చెందిన వారు కాగా, షేక్ ఇలియాస్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. నిందితులపై ఐపీసీ సెక్షన్ 20బీ, 153(ఏ)తోపాటు యూఏ(పీ) యాక్ట్‌లోని సెక్షన్ 17, 18ఏ, 18బీ సెక్షన్ల కింద చార్జిషీట్ పొందుపర్చామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. విద్వేష ప్రసంగాలతో స్థానికంగా ఉండే యువతను ఆకర్షించి, పీఎ్‌ఫఐలో చేర్పించినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. యోగా, కరాటే పేరుతో కత్తులు, కొడవలి, ఇనుప రాడ్లు ఉపయోగించి దాడులకు పాల్పడేలా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని వెల్లడించారు.