వజ్రోత్సవం..

ABN , First Publish Date - 2022-09-17T17:01:57+05:30 IST

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మహానగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా

వజ్రోత్సవం..

ఘనంగా సమైక్యతా ర్యాలీలు

త్రివర్ణ పతాకాలు చేబూని పాల్గొన్న పౌరులు


హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మహానగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. జాతీయ పతాకాలు చేబూని ప్రభుత్వ విభాగాల అధికారులు, ఉద్యోగులు, నగరవాసులు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ నుంచి పీపుల్స్‌ ప్లాజా వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.  అంతకుముందు సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌ సర్కిల్‌ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్న తలసాని మాట్లాడుతూ..  స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం గర్వపడే విధంగా తెలంగాణలో వజ్రోత్సవాలు నిర్వహించామన్నారు.


భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి మనం ప్రత్యేక దేశంగా ఉండే వారమని, వేలాది మంది పోరాటాలు, ప్రాణ త్యాగాల అనంతరం 1948లో భారత్‌లో విలీనం జరిగిందన్నారు. విలీనమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ సమైక్యతా స్ఫూర్తిని చాటేలా మూడు రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నేడు ఎన్‌టీఆర్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షల వివరాలను ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ వెల్లడించారు.

Updated Date - 2022-09-17T17:01:57+05:30 IST