టీడీఆర్.. ఢమాల్..!
ABN , First Publish Date - 2022-12-10T00:14:36+05:30 IST
రియల్ రంగం శరవేగంగా దూసుకుపోతోన్న మహానగరంలో అభివృద్ధి బదలాయింపు హక్కు(టీడీఆర్)కు డిమాండ్ తగ్గుతోంది. అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్‌ల్లో మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించినా, టీడీఆర్ కొనుగోలు చేసేందుకు నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదు. ఇది గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాజెక్టుల కోసం ఆస్తుల సేకరణపై ప్రభావం చూపే అవకాశముందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
గణనీయంగా తగ్గిన డిమాండ్
వాస్తవ విలువలో 40-50 శాతానికే విక్రయించాల్సిన దుస్థితి
ఆస్తులు కోల్పోయిన యజమానులకు నష్టమే
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వైనం
రూ.3500 కోట్ల టీడీఆర్‌లు జారీ
తప్పనిసరి చేసేలా జీహెచ్‌ఎంసీ ప్రతిపాదన
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): రియల్ రంగం శరవేగంగా దూసుకుపోతోన్న మహానగరంలో అభివృద్ధి బదలాయింపు హక్కు(టీడీఆర్)కు డిమాండ్ తగ్గుతోంది. అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్‌ల్లో మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించినా, టీడీఆర్ కొనుగోలు చేసేందుకు నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదు. ఇది గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాజెక్టుల కోసం ఆస్తుల సేకరణపై ప్రభావం చూపే అవకాశముందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత స్థల విస్తీర్ణం, ఎత్తు(అంతస్తులు) దాటిన నిర్మాణాలకు టీడీఆర్ తప్పనిసరి చేయాలని జీహెచ్‌ఎంసీ పంపిన ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో భవిష్యత్ టీడీఆర్‌ల జారీపై సందిగ్ధత ఏర్పడింది.
పరిహారానికి ప్రత్యామ్నాయంగా..
నగరంలో గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ), లింక్/మిస్సింగ్ రోడ్ల నిర్మాణం, వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ) వంటి ప్రాజెక్టులు రూ. వేల కోట్ల వ్యయంతో చేపట్టారు. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశలో రూ.8 వేల కోట్లతో పనులు చేపట్టారు. వంతెనలు, అండర్‌పా్‌సల కోసం భారీగా ఆస్తులు సేకరించారు. బాధితులకు చట్ట ప్రకారం రెట్టింపు పరిహారం చెల్లించాలి. దీని కోసం వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పరిహారం చెల్లింపునకు ప్రత్యామ్నాయంగా ముంబై తరహాలో ప్రయోగాత్మకంగా గ్రేటర్‌లో టీడీఆర్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఆస్తులు కోల్పోయిన వారికి స్థల వివాదం లేకుంటే పరిహారానికి నాలుగు రెట్లు, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నిర్మాణాలకు రెండు రెట్ల టీడీఆర్ ఇచ్చారు. మొదట్లో బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. టీడీఆర్ వ్లల ప్రయోజనాలను అధికారులు వివరించారు. ఐదేళ్లలో రూ.3500 కోట్ల విలువైన టీడీఆర్‌లు జారీ చేశారు. దీంతో ఆస్తుల సేకరణకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది. టీడీఆర్‌ను నిర్మాణదారులకు అందుబాటులో ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ బ్యాంకు ఏర్పాటు చేశారు. అవసరమైన నిర్మాణదారులు కొనుగోలు చేసేలా టీడీఆర్ యజమానుల వివరాలను అందుబాటులో ఉంచారు.
రెండో దశకు కష్టమే..
రూ.20 లక్షల విలువైన ఆస్తిని కోల్పోయిన వ్యక్తికి.. రూ.80 లక్షల విలువైన టీడీఆర్ (స్థల వివాదం లేకుంటే) జీహెచ్‌ఎంసీ జారీ చేసింది. ఆ టీడీఆర్‌ను అంతే మొత్తం లేదా రూ.40 లక్షలు అంతకంటే తక్కువ, ఎక్కువకూ విక్రయించే వెసులుబాటు యజమానికి ఉంటుంది. సాధారణంగా ఆస్తులు కోల్పోతే పరిహారం వెంటనే చెల్లిస్తారు. టీడీఆర్ తీసుకుంటే విక్రయానికి సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎక్కువ విలువైన టీడీఆర్‌లు జారీ చేశారు. మొదట్లో ఈ టీడీఆర్‌లకు కొంత డిమాండ్ ఉన్నప్పటికీ, కొన్ని నెలలుగా టీడీఆర్ డిమాండ్ తగ్గినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీఆర్ వాస్తవ విలువలో 40-50 శాతానికి కూడా ఎవరూ కొనుగోలు చేయడం లేదని సమాచారం. ఇది టీడీఆర్ తీసుకున్న వారికి ఆర్థికంగా నష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఆస్తుల సేకరణ కోసం జారీ చేసే టీడీఆర్‌లను తీసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అదే జరిగితే రెండో దశ ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుల్లో ముందడుగు పడడం కష్టమే.
సర్కారు వద్ద పెండింగ్
టీడీఆర్ డిమాండ్ తగ్గుతోన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నిర్ణీత స్థల విస్తీర్ణం, ఎత్తు దాటిన భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవాలని పురపాలక శాఖకు బల్దియా ప్రతిపాదనలు పంపింది. ఆరు నెలలైనా.. ఇప్పటికీ సర్కారు వద్దే ఆ ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.