ఏడుగురిని మింగిన ఈత సరదా
ABN , First Publish Date - 2022-11-20T03:25:30+05:30 IST
ఈత సరదా ఒకే రోజు ఏడు ప్రాణాలను తీసింది.
హైదరాబాద్‌లో ముగ్గురు చిన్నారులు.. ఖమ్మం విద్యార్థులు ఇద్దరు.. నిజామాబాద్‌లో ఇద్దరి మృతి
ఖమ్మం జిల్లాలో ఇద్దరు యువకుల గల్లంతు
రాయదుర్గం, పెనుబల్లి/మధిర రూరల్, నవీపేట, నవంబరు 19: ఈత సరదా ఒకే రోజు ఏడు ప్రాణాలను తీసింది. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు యువకులు కన్నుమూశారు. మరో ఘటనలో ప్రమాదవశాత్తు చేపల కుం టలో పడి ఇద్దరు మరణించారు. హైదరాబాద్, నానక్‌రామ్‌గూడ్‌లోని పటేల్‌కుంట చెరువులో మునిగి షాబాజ్(15), దీపక్(12), పవన్(13) అనే బాలురు చనిపోయారు. గచ్చిబౌలి టెలికామ్‌నగర్‌కు చెందిన 10 మంది పిల్లలు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పటేల్‌కుంట్ చెరువుకు వెళ్లారు. చెరువులో ఈత కొడుతూ లోతైన ప్రదేశానికి చేరిన షాబాజ్, దీపక్, పవన్ నీళ్లలో మునిగిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన మిగిలిన పిల్లలు రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో వాహనాదారులు ఆగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరేసరికే చి న్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో ఖమ్మం జిల్లా, మధిర మండలం మడుపల్లికి చెందిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు నీటిలో ముని గి చనిపోయారు. మడుపల్లిలోని సరస్వతీ విద్యాలయానికి చెందిన సుమా రు 80 మంది విద్యార్థులు ఏపీ, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు వనభోజనాలకు వెళ్లారు. అక్కడ మున్నేరు ఒడ్డున ఉన్న మామిడితోటలో ఆటపాటలతో సరదాగా గడిపారు.
అయితే, మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శీలం వెంకట నర్సిరెడ్డి(12), జశ్వంత్(10) మరో ఇద్దరు కలిసి మున్నేరులోకి దిగారు. వారు దిగిన చోటు ఊబి ఉండటంతో జశ్వంత్, నర్సిరెడ్డి నీటిలో మునిగి చనిపోయారు. ఇక, ఖమ్మంజిల్లా పెనుబల్లి మం డలం కుప్పెనకుంట్ల ఎన్నెస్పీ కాల్వలో ఈతకు దిగిన తల్లపురెడ్డి నరేందర్‌రెడ్డి(20), అవులూరి నాగనరేందర్‌రెడ్డి(20) గల్లంతయ్యారు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న నరేందర్ రెడ్డి.. తన తండ్రి కృష్ణారెడ్డి ఇరుముడి కార్యక్రమం కోసం స్వగ్రామం గట్టుపాడు వచ్చాడు. ఆ కార్యక్రమానికి తన స్నేహితుడు, సత్తుపల్లిలో డిగ్రీ చదువుతున్న నాగనరేందర్ ను ఆహ్వానించాడు. ఇరుముడి ముగిశాక ఇద్దరూ కలిసి ఎన్నెస్పీ కాల్వలో ఈతకు వెళ్లి అక్కడ గల్లంతయ్యారు.
కాల్వలో నీటి ఉధృతి అధికంగా ఉండడంతో వారి ఆచూకీ లభించలేదు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనలో చేపలకుంటలో మునిగి దారం శ్రీధర్(45), బట్టు భూమేష్(35) అనే ఇద్దరు చనిపోయారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్‌కు నవీపేట మండలం శాఖాపూర్ శివారులో జామతోట ఉంది. ఈ తోటకు స్ర్పే కొట్టేందుకు పాలేరులు భూమేష్, లక్ష్మణ్‌తో కలిసి శనివారం మధ్యాహ్నం పని ప్రారంభించాడు. స్ర్పే మందుకు కావాల్సిన నీరు కోసం భూమేష్ తోటలోని చేపల కుంట దగ్గరికి వెళ్లి అందులో జారిపడ్డాడు. లక్ష్మణ్ అతన్ని బయటకు లాగే ప్రయత్నం చేయగా.. ఇద్దరూ లోపలికి వెళ్లిపోయారు. వీళ్లను కాపాడేందుకు శ్రీధర్ కుంటలో దూకగా.. భూమే్‌షను వదిలించుకున్న లక్ష్మణ్ ఒడ్డు కు చేరాడు. కానీ, శ్రీధర్, భూమేష్ కుంటలో మునిగిపోయారు.