వడ్డీతో సహా అప్పు మొత్తం చెల్లించినా ఆగని వేధింపులు

ABN , First Publish Date - 2022-08-04T05:56:04+05:30 IST

తీసుకున్న అప్పుతోపాటు వడ్డీ మొత్తం చెల్లించినా ఇంకా చెల్లించాలన్న వేధింపులు భరించలేక ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు.

వడ్డీతో సహా అప్పు మొత్తం చెల్లించినా ఆగని వేధింపులు

 ఏపీ సీఎంకు లేఖ రాసి రియల్‌ వ్యాపారి ఆత్మహత్య


ఏఎ్‌సరావునగర్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): తీసుకున్న అప్పుతోపాటు వడ్డీ  మొత్తం  చెల్లించినా ఇంకా చెల్లించాలన్న వేధింపులు భరించలేక ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎంకు లేఖ రాసి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు పట్టణం కొరిటిపాడుకు చెందిన చెన్నంరాజు గిరిధర్‌వర్మ(40) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.  గుంటూరుకు చెందిన ఎ.వెంకటరెడ్డి అనే మున్సిపల్‌ కౌన్సిలర్‌ వద్ద2010లో గిరిధర వర్మ వ్యాపార అవసరాల నిమిత్తం రూ.10 వడ్డీకి రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్ల అనంతరం తీసుకున్న అప్పు, వడ్డీతో సహా తిరిగి చెల్లించాడు. అయినా వెంకటరెడ్డి ఇంకా అప్పు ఉందని వేధించడం మొదలుపెట్టాడు. తనకు ఎన్నికలలో రూ.70లక్షలు ఖర్చు అయ్యాయని, అప్పుగా తీసుకున్న డబ్బులు ఇంకా ఇవ్వాలని, లేని పక్షంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బలిజేపల్లిలో ఉన్న వ్యవసాయ భూమిని కబ్జా చేస్తానని బెదిరించసాగాడు. ఈ వేధింపులు రోజు రోజుకూ ఎక్కువ కావడంతో గిరిధర్‌ వర్మ భార్య దివ్యను గుంటూరులోనే వదిలి మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఏఎ్‌సరావునగర్‌ ఆదిత్యనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భార్య దివ్య ఫోన్‌ చేయగా గిరిధర్‌ వర్మ స్పందించలేదు. దాంతో ఆమె బుధవారం తెల్లవారు జామున ఆదిత్యనగర్‌లో ఉంటున్న బంధువులకు ఫోన్‌ చేసి విషయం తెలిపింది. వారు గిరిధర్‌ వర్మ ఇంటికి వెళ్లి ఎంత పిలిచినా పలకలేదు. దాంతో వారు ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తొలగించి చూడగా బెడ్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కన్పించాడు. వెంటనే వారు కుషాయిగూడ పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్న రుణం మొత్తం చెల్లించినా వెంకటరెడ్డి వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వర్మ ఏపీ సీఎంకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్ల పోలీసులు తెలిపారు. 



Updated Date - 2022-08-04T05:56:04+05:30 IST