మెట్లబావులకు మహర్దశ

ABN , First Publish Date - 2022-12-07T00:43:04+05:30 IST

బన్సీలాల్‌పేటలోని మెట్లబావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులపై విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో నగరంలోని మరిన్ని పురాతన బావులను ఆధునికీకరించాలని పురపాలక శాఖ నిర్ణయించింది.

మెట్లబావులకు మహర్దశ

నాలుగు నెలల్లో మరో పది బావుల పునరుద్ధరణ

బన్సీలాల్‌పేట మెట్లబావి పరిసరాలకు అరుదైన గుర్తింపు

నీటి నిల్వ కేటగిరీలో యూఏఈ అవార్డు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): బన్సీలాల్‌పేటలోని మెట్లబావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులపై విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో నగరంలోని మరిన్ని పురాతన బావులను ఆధునికీకరించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. నగరంలో 44 మెట్ల బావులున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దశల వారీగా వీటిని పునరుద్ధరించి, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 10 మెట్లబావులను నాలుగు నెలల్లో పునరుద్ధరించనున్నట్టు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. 17వ శతాబ్దంలో స్థానికుల తాగునీటి అవసరాల కోసం బన్సీలాల్‌పేటలో మెట్ల బావిని తవ్వారు. బావి ఉబికి వచ్చే నీటితో స్థానికులు దాహార్తి తీర్చుకునే వారు. నిర్వహణలోపంతో అధ్వానంగా మారిన బావిని స్వచ్ఛంద సంస్థల సహకారంతో పురపాలక శాఖ పునరుద్ధరించింది.

అంతర్జాతీయ అవార్డు

బన్సీలాల్‌పేట మెట్లబావి, పరిసరాల అభివృద్ధికి అరుదైన గౌరవం లభించింది. ప్రారంభించిన మరునాడే మెట్లబావిలో వర్షపు నీటి నిల్వకు చేపట్టిన చర్యలకు అవార్డు వచ్చింది. వారసత్వ సంపద పరిరక్షణకు చేపట్టిన చర్యలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. సంప్రదాయ పద్ధతిలో వర్షపు నీటి నిల్వకు పునరుజ్జీవం కల్పించినందుకు యూఏఈలోని ఎనర్జీ, ఇన్‌ఫ్రా మంత్రిత్వ శాఖ 2022 సంవత్సరానికిగాను సుస్థిర చొరవ (సస్టెయినబుల్‌ ఇన్నోవేటీవ్‌ ఆఫ్‌ ది ఈయర్‌-2022) కేటగిరిలో బిగ్‌-5 కన్‌స్ట్రక్షన్‌ ఇంపాక్ట్‌ అవార్డుకు ఎంపికైందని అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో తెలిపారు. యుఏఈ నుంచి అవార్డుల కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చిన ఆహ్వానపత్రాన్ని ఆయన పోస్ట్‌ చేశారు. 17 కేటగిరీల్లో యుఏఈ ఎంట్రీలను స్వీకరించగా.. పనులు పూర్తయిన నేపథ్యంలో గతంలోనే బన్సీలాల్‌పేట మెట్లబావి పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాన్ని వివరిస్తూ దరఖాస్తు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అవార్డు రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మెట్ల బావి పునరుద్ధరణలో నీటి నిల్వ పనులను గండిపేట వెల్ఫేర్‌ సొసైటీ ద్వారా క్షేత్ర కన్సల్టెంట్స్‌ రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు చేపట్టింది.

Updated Date - 2022-12-07T00:43:05+05:30 IST