త్వరగా తేల్చండి.. లేకుంటే ఇరుక్కుంటాం

ABN , First Publish Date - 2022-11-04T04:18:48+05:30 IST

మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సలో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ...

త్వరగా తేల్చండి.. లేకుంటే ఇరుక్కుంటాం

మహారాష్ట్రలో ఇంటెలిజెన్స్‌లేదా..?

అక్కడ ఎలా సాధ్యమైంది??: సింహయాజి

రాజాసింగ్‌ విషయం ప్రస్తావించిన గువ్వల

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సలో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్‌లో కీలకమైన నాలుగు వీడియోలను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇంతకు ముందు విడుదలైన రెండు ఆడియోలు డీల్‌ మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టగా.. తాజాగా విడుదలైన వీడియోలు.. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎలా పడగొడుతోంది? ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేస్తోంది? నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు- పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులతో మధ్యవర్తులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ సంభాషణను కళ్లకు కట్టినట్లుగా వివరించాయి.

అధునాతన కెమెరాలు, నాయిస్‌ రిడక్షన్‌ టెక్నాలజీ కారణంగా.. ఈ సంభాషణలు సాంతం స్పష్టంగా రికార్డయ్యాయి. పార్టీ మార్పు అంశాన్ని త్వరగా తేల్చాలని, లేకుంటే.. అటూ-ఇటూ కాకుండా ఇరుక్కుంటామని మధ్యవర్తులతో ఎమ్మెల్యేలు అన్నారు. మూడు గంటలకు పైగా సాగిన ఈ సంభాషణల్లో.. గువ్వల బాలరాజు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రస్థావనను తీసుకువచ్చారు. ఈ వీడియోల్లో కీలక సంభాషణ ఇలా ఉంది..

సింహయాజి: సంతోష్జీ వాళ్లంతా.. ముందుగా ఏదీ మాట్లాడకుండా ఎట్లా నమ్మేది అని ప్రశ్నించారు. రామచంద్ర భారతితో సంతో్‌షనే ఇక్కడికి రమ్మని, ఇద్దరం కూర్చుని మాట్లాడి ఫైనల్‌ చేస్తాం అని చెప్పా. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి జాయిన్‌ అయితే సరిపోతుందన్నాను.

ఎమ్మెల్యేలు: అది బెటర్‌..! మా ఉద్దేశం ఏమిటంటే ఆలస్యమైతే అటు ఇటు కాకుండా అయిపోతాం.

రోహిత్‌రెడ్డి: ఇన్ని రోజులు మేం మునుగోడు పోకుండా ఉండలేం సామీజీ. ఇప్పటికే ఈ కొడుకులు ఏందో ఏమో..! అది కాకుండా ఆయన(నందును చూపుతూ) పొద్దున్నే చెబుతున్నాడు ఫోన్లు దూరం పెట్టు అని ఏదేదో చెప్పిండు.

సింహయాజి: ఏం లేకుండా ఇన్ని ఆపరేషన్లు చేయలేం కదా. మహారాష్ట్రలో ఇంటెలిజెన్స్‌ లేదా? మరి అక్కడ ఎలా సాధ్యమైంది?

రామచంద్ర భారతి: (బయట ఫోన్‌ మాట్లాడి లోనికి వస్తు..) అమిత్‌ షా ఫోన్‌ తీయడం లేదు.

రోహిత్‌రెడ్డి: స్వామీజీ మీరు పాలు తీసుకోండి.

రామచంద్ర భారతి: దేశీ అవు పాలా?

రోహిత్‌ రెడ్డి: అవును. ఈ ఫాం ఆవులే.

రామచంద్ర భారతి: దేశీ ఆవు పాలు అయితే అందులో చక్కర కలుపుకోవాల్సిన అవసరం ఉండదు.

రోహిత్‌ రెడ్డి: మా ఫాంలో 4 గుర్రాలు ఉన్నాయి.

సింహయాజి: ఓ.. అలాగే..! మీరు నలుగురు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.

గువ్వల బాలరాజు: (సింహయాజిని చూస్తూ) మీ పేరు ఏమంటిరి స్వామీ?

సింహయాజి: సింహయాజి. నాది పెద్ద పేరు. ప్రసన్న శ్రీ కరుణాకర్‌ వేంకటనాథ సింహయాజి.

రామచంద్ర భారతి:నా పేరు రామచంద్ర భారతి.

ఎమ్మెల్యేలు: ఇప్పుడు ఏం చేద్దామంటారు స్వామి..?

రామచంద్ర భారతి: ముందుగా వారు చెల్లింపుల గురించి మట్లాడాలంటున్నారు. అమిత్‌ షాతో మాట్లాడేందుకు సంతోష్‌ ప్రయత్నిస్తున్నారు. కానీ కుదరడం లేదు. నేను కూడా కంటిన్యూగా ప్రయత్నిస్తున్నా.

ఎమ్మెల్యేలు: మేం కొంత సమయం వేచి చూస్తాం.

రామచంద్ర భారతి:మీరు వదిలేద్దాం అని చెప్పినా.. నేను వదలను. మీరు చాలా దూరం నుంచి వచ్చారు. నేను ఢిల్లీ నుంచి వచ్చా. రేపు ఉదయం 10 నా ఇంటికి సమీపంలో అమిత్‌ షా సమావేశం ఉంది. నేను ఉదయం 8 వరకు అక్కడికి చేరుకోవాలి. నా ఒక్క స్పీచ్‌ కనీసం లక్ష రూపాయలు ఉంటుంది తెలుసా?

బాలరాజు: రాజాసింగ్‌ సంగతేంటి?

రామచంద్ర భారతి: అతని గురించి వదిలేయ్‌..!

నందు: ఆయనదంతా పంచాయతీ, కొట్లాట ఉంటది.

బాలరాజు: రాజాసింగ్‌ కమిట్‌మెంట్‌తో ఉంటాడు కదా. ఆరెస్సెస్‌, బీజేపీ విషయంలో?

రామచంద్ర భారతి: ఇక్కడ నిబద్ధత కాదు..! నీ వెంట అనుచరులు ఉన్నంత వరకే విలువ. అనుచరులు లేకపోతే ఏమీ ఉండదు.

సవ్యంగా జరిగితే తిరుమల వెళ్లొద్దాం!

డీల్‌ సరిగా కుదిరి.. అనుకున్నట్లు అంతా సవ్యంగా జరిగితే.. తిరుమల కొండకు వెళ్లి దర్శనం చేసుకొని రావాలని ఆ నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మధ్యవర్తులు మాట్లాడుకున్నారు. రేగా కాంతారావు మాట్లాడుతూ.. పైలెట్‌ సాబ్‌ ఎట్లా చెబితే అట్లాగే చేద్దామన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల వృత్తి, ప్రవృత్తి అంశం కూడా చర్చకు వచ్చింది. హర్షవర్దన్‌రెడ్డి సీనియర్‌ అడ్వొకేట్‌ అని, జర్మనీ లాంటి దేశాల్లో కేసులు వాదించిన సందర్భాలున్నాయని సింహయాజికి రోహిత్‌రెడ్డి చెప్పారు. ఆపరేషన్‌ మొత్తం ఢిల్లీ నుంచి జరుగుతుందని సింహయాజి అన్నారు. తుషార్‌ అంతా చూసుకుంటారని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు

రామచంద్రభారతి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఆసక్తికర ఆఫర్లతో బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు చేశారు. ‘‘ఓపెన్‌గా చెప్పేయండి.. మా ప్రాతిపాదనలు మీకు ముందుగానే చెప్పాం’’ అని అన్నారు. పార్టీలో చేరే ముందుకు ఒక్కో ఎమ్మెల్యేకి రూ.50 కోట్లు ఇస్తామన్నారు. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడికి డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నందు వివరించారు. బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు బీ-ఫాం ఇప్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. బీజేపీ అంటే లోకల్‌ పార్టీ కాదని.. జాతీయ పార్టీ అని.. ఆరెస్సెస్‌ ఆర్గనైజర్‌ సంస్థ మాత్రమేనని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-04T04:18:50+05:30 IST