Shocking : బావర్చీ బిర్యానీలో బల్లి అవశేషాలు
ABN , First Publish Date - 2022-05-28T13:58:43+05:30 IST
బావర్చీ బిర్యానీలో బల్లి అవశేషాలు

- బీజేవైఎం ఆందోళన
- తనిఖీలు నిర్వహించిన అధికారులు
హైదరాబాద్ సిటీ/రాంనగర్ : బావర్చీ హోటల్ (Bawarchi Hotel) బిర్యానీలో (Biryani) బల్లి అవశేషాలు కనిపించడం కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం.. రాంనగర్ కార్పొరేటర్ కె.రవిచారి మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చీ హోటల్లో చికెన్ బిర్యానీ, తందూరీ రోటీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు. డెలివరీ వచ్చాక రవిచారి, అతడి మిత్రులు బాకారంలోని పార్టీ కార్యాలయంలో తినేందుకు సిద్ధమవుతుండగా, బిర్యానీ మధ్యలో బల్లి అవశేషాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వాంతులు చేసుకుని, ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం బావర్చి హోటల్ వద్దకు వచ్చి యజమానికి ఫిర్యాదు చేశారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో జీహెచ్ఎంసీ (GHMC) ఫుడ్ కంట్రోల్ అధికారులకు, ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయికి, చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ మైత్రేయి సిబ్బందితో హోటల్‌కు చేరుకుని హోటల్లోని బిర్యానీ శాంపిల్స్ సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని చిక్కడపల్లి సీఐ సంజయ్ తెలిపారు. నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న బావర్చీ హోటల్‌ను సీజ్ చేయాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ రవిచారి డిమాండ్ చేశారు.

సీజ్ చేయాలని ఆందోళన
వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బావర్చీ హోటల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో హోటల్ వద్ద ధర్నా చేశారు.