Shocking : రూ.99 విలువైన Earphones కొన్న పాపానికి.. 33 లక్షలు కొట్టేశారు..!

ABN , First Publish Date - 2022-03-05T14:33:35+05:30 IST

ఈ కామర్స్‌ సైట్లో రూ.99తో ఇయర్‌ ఫోన్స్‌ కొన్న పాపానికి ఓ మహిళ నుంచి ..

Shocking : రూ.99 విలువైన Earphones  కొన్న పాపానికి.. 33 లక్షలు కొట్టేశారు..!

హైదరాబాద్‌ సిటీ : ఈ కామర్స్‌ సైట్లో రూ.99తో ఇయర్‌ ఫోన్స్‌ కొన్న పాపానికి ఓ మహిళ నుంచి రూ. 33లక్షలు కొల్లగొట్టాడో సైబర్‌ కేటుగాడు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి 3.50 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.29 లక్షలు ఫ్రీజ్‌ చేశారు. నాలుగు ఫోన్లు, 9సిమ్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు, బ్యాంకు అకౌంట్స్‌ పాస్‌బుక్స్‌-5, ఆధార్‌, పాన్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లో శుక్రవారం రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు.


ఓ మహిళ ఆన్‌లైన్‌ క్లాసుల అటెండవుతున్న తన కుమార్తె కోసం ఈ కామర్స్‌ సైట్లో గతేడాది ఆగస్టులో రూ.99 విలువైన ఇయర్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసింది. కొద్దిరోజుల తర్వాత గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి షాపింగ్‌ చేసిన కూపన్స్‌కు లాటరీ తీయగా, ఖరీదైన కారును గిఫ్టుగా గెలుచుకున్నారంటూ నమ్మించాడు. దాని ఖరీదు రూ. 15.50లక్షలు అని, అవసరమైతే కారును లేదా దాని ఖరీదు విలువ డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తామంటూ బురిడీ కొట్టించారు. నమ్మిన మహిళ డబ్బులు కావాలంటూ కోరింది. అందుకు సైబర్‌ కేటుగాళ్లు ప్రాసెస్‌ పేరిట ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ, ఇన్సూరెన్స్‌ చార్జీలు చెల్లించాలంటూ విడతల వారీగా రూ. 25.5 లక్షలు జమ చేయించుకున్నారు. వాటిలో చాలా డబ్బులు రీఫండబుల్‌గా తిరిగి మీ ఖాతాలోనే జమ అవుతాయని నమ్మించారు.


ఆన్‌లైన్‌లో ఆమె కుమార్తెతో మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయం కోసం అంటూ ఆమె మరో బ్యాంకు ఖాతా నంబర్‌ తెలుసుకుని అందులోని రూ.7.5లక్షలు కొల్లగొట్టారు. ఇలా మొత్తం రెండు ఖాతాల్లో కలిపి రూ.33లక్షలు దోచేశారు. ఎంతకీ కారుకు సంబంధించిన డబ్బులు ఖాతాలో జమకాకపోవడం, ఇంకా డబ్బులు డిమాండు చేస్తుండడంతో అనుమానించిన మహిళ వారిని గట్టిగా నిలదీసింది. దీంతో వారు ఫోన్లు స్విచాఫ్‌ చేశారు. దాంతో బాధితురాలు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకుంది. కూతురు పెళ్లికోసం దాచిన డబ్బులు  మొత్తం దోచేశారని తెలిపింది. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించి నిందితుల ఆట కట్టించారు. ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో బిహార్‌ వెళ్లిన టీమ్‌ నిందితుడు రాజేష్‌ కుమార్‌ మహతోని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Updated Date - 2022-03-05T14:33:35+05:30 IST