రాష్ట్ర ఆర్థిక భవిష్యత్‌ కోసమే రోశయ్య పనిచేశారు

ABN , First Publish Date - 2022-11-23T03:23:49+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు కోసం కొణిజేటి రోశయ్య ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

రాష్ట్ర ఆర్థిక భవిష్యత్‌ కోసమే రోశయ్య పనిచేశారు

రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం.. పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు

వర్ధంతి సభలో ప్రముఖులు

ఏబీఎన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాష్‌ నివాళులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు కోసం కొణిజేటి రోశయ్య ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని, అజాతశత్రువుగా పేరు తెచ్చుకొన్నారని కొనియాడారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 16 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కుతుందన్నారు. దివంగత మాజీ సీఎం రోశయ్య ప్రథమ వర్ధంతి సభను అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. రోశయ్య ఏ పదవిలో ఉన్నా దానికి వన్నె తెచ్చారన్నారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాష్‌, ప్రముఖ వ్యాపారవేత్త కోగంటి ఈశ్వర్‌చంద్‌, ఏపీ మంత్రి మేరుగ నాగార్జున, తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మ య్య, షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ వీహెచ్‌, కాంగ్రెస్‌ నాయకులు తులసిరెడ్డి, కుసుమ కుమార్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస గుప్తా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌ గుప్తా, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గణేష్‌గుప్తా, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ వీరభద్రస్వామి, ఎమ్మె ల్యేలు వి.శ్రీనివాస్‌, మద్దాలి గిరిధర్‌, మాజీ మంత్రులు పి. సత్యనారాయణ, మండలి బుద్ధప్రసాద్‌, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, మల్లిఖార్జున్‌తో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. రోశయ్య కుమారులు శివసుబ్బారావు, శ్రీమన్నారాయణమూర్తి, అల్లుడు కృష్ణప్రసాద్‌ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

2009లో రోశయ్య

ఆశీస్సులతోనే పోటీ చేశా

రోశయ్య ఆశీస్సులతో 2009లో వేమూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశాను. రోశయ్య వేమూరు ప్రాంతంలో పుట్టడం మా అదృష్టం. డిసెంబరు 4న వేమూరులో ఏపీ ప్రభుత్వం తరఫున సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రోశయ్య ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం. - మేరుగ నాగార్జున

రోశయ్య

హయాంలోనే ఎక్కువ ఫిట్‌మెంట్‌

సొంతపేరు కోసం కాకుండా రాష్ట్ర ఆర్థిక భవిష్యత్‌ కోసం పనిచేసిన ఆర్థికమంత్రి, సీఎంగా రోశయ్య చరిత్రలో నిలిచిపోతారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ గత 30 ఏళ్లల్లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడే ఎక్కువగా ఇచ్చారు. ప్రతిపక్షాలను చీల్చిచెండాడంలో ఆయన కంటే మేధావి మరొకరు లేరు.

- ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌

సొంత పార్టీ నేతలే

వ్యతిరేక ప్రచారం చేశారు

రోశయ్య సీఎంగా పనికిరాడని సొంత పార్టీ నేతలే ప్రచారం చేశారు. రోశయ్య కొంతకాలమే సీఎంగా ఉన్నా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేశారు. - వి. హన్మంతరావు

Updated Date - 2022-11-23T03:23:50+05:30 IST