Raja Singh : రాజాసింగ్ విడుదల
ABN , First Publish Date - 2022-11-10T06:08:32+05:30 IST
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది. ప్రివెంటివ్ డిటెన్షన్(పీడీ) చట్టం కింద ప్రభుత్వం ఆయనకు విధించిన ఏడాది
ఎమ్మెల్యేపై పీడీ కేసును కొట్టేసిన హైకోర్టు
విడుదలయ్యేప్పుడు ర్యాలీలు వద్దు
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు
చర్లపల్లి జైలు వద్ద సంబురాలకు
రాజాసింగ్ అభిమానుల విఫలయత్నం
శ్రీరాముని ఆశీర్వాదంతోనే వచ్చాను
మద్దతుదారులకు కృతజ్ఞతలు: రాజాసింగ్
హైదరాబాద్/కుషాయిగూడ/మంగళ్‌హాట్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది. ప్రివెంటివ్ డిటెన్షన్(పీడీ) చట్టం కింద ప్రభుత్వం ఆయనకు విధించిన ఏడాది నిర్బంధాన్ని బుధవారం కొట్టేసింది. రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ‘జైలు నుంచి బయటికి వెళ్లేప్పుడు ర్యాలీలు నిర్వహించవద్దు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు. ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దు’ అని ఆదేశించింది. బుధవారం సాయంత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయగానే రాజాసింగ్ భార్య ఉషాభాయి న్యాయవాదులతో కలిసి జైలుకు వెళ్లారు. అప్పటికే బెయిల్ ఆర్డర్ ఆన్‌లైన్ ద్వారా జైలు అధికారులకు చేరడంతో నిమిషాల వ్యవధిలోనే రాజాసింగ్‌ను విడుదల చేశారు.
ఇంటి వద్ద సంబరాలు
కోర్టు ఆదేశాల మేరకు రాజాసింగ్ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడకుండా, అభివాదం చేస్తూ జైలు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. రాజాసింగ్ విడుదల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుషాయిగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజాసింగ్ అనుచరులు, అభిమానులు ర్యాలీ తీసేందుకు విఫలయత్నం చేశారు. బాణసంచా పేల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జైలు ప్రధాన ద్వారం నుంచి దాదాపు అర కిలోమీటర్ వరకు ఎవరూ గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వాహనంలో వెళ్తున్న రాజాసింగ్‌ను చూసి అభిమానులు చేసిన ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడంతో ఆ పరిసరాలు హోరెత్తాయి. రాజాసింగ్ విడుదలతో మంగళ్‌హాట్‌లోని రాజాసింగ్ ఇంటి వద్ద ఆయన బంధువులు, స్నేహితులు సంబురాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు.
ఆగస్టు 25న అరెస్టు
విద్వేష ప్రసంగాలతో సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు రాజాసింగ్‌పై ఆగస్టు 25న పీడీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజాసింగ్ రెండున్నర నెలలుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజాసింగ్ అరెస్టుపై ఆయన భార్య ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు రాజాసింగ్ నిర్బంధాన్ని సమర్థించింది. దీంతో ప్రభుత్వం రాజాసింగ్ నిర్బంధాన్ని ప్రభుత్వం 12 నెలలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను కూడా సవాల్ చేస్తూ ఉషాభాయి సవరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది.
శ్రీరాముడి ఆశీర్వాదంతోనే వచ్చాను
శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదంతో తాను జైలు నుంచి క్షేమంగా బయటకు వచ్చినట్లు రాజాసింగ్ చెప్పారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ప్రకటన విడుదల చేశారు. ‘నా అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన హిందువులు, అనుచరులు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా ఽకృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ త్వరలో ఎత్తివేసే అవకాశం ఉంది. సస్పెన్షన్ ఎత్తివేతపై బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్టు పార్టీ రాష్ట్ర వర్గాలు పేర్కొన్నాయి. రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపాయి.