ప్రాణవాయు పార్కులు

ABN , First Publish Date - 2022-01-30T16:06:07+05:30 IST

కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌ మహానగరంలో పచ్చందాలు పెరుగుతున్నాయి. గ్రేటర్‌లో అటవీ విస్తీర్ణం గతంతో పోలిస్తే గణనీయంగా

ప్రాణవాయు పార్కులు

స్వచ్ఛమైన ఆక్సిజన్‌..

సందర్శకులను అలరించేలా ఏర్పాట్లు

గాజుల రామారంలో అందుబాటులోకి

60 ఎకరాల్లో సకల సదుపాయాలతో

నగరానికి మరో రెండు వైపుల కూడా

సరదాగా వాకింగ్‌.. ఆహ్లాదంగా యోగా

బహుళ ప్రయోజనకరంగా రూపకల్పన


హైదరాబాద్‌ సిటీ: కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌ మహానగరంలో పచ్చందాలు పెరుగుతున్నాయి. గ్రేటర్‌లో అటవీ విస్తీర్ణం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని సాక్షాత్తు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. 2011తో పోలిస్తే నగరంలో అటవీ విస్తీర్ణం (పచ్చదనం) 147 శాతం పెరిగిందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తోన్న పార్కులే ఇందుకు ప్రధాన కారణమని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. నగరంలోని ఖాళీ స్థలాలతోపాటు... శివార్లలోని అటవీ ప్రాంతాల్లో అదనపు పచ్చందాలు అద్దేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొంటున్నారు. సంస్థలోని జీవవైవిధ్య  విభాగం (అర్బన్‌ బయో డైవర్సిటీ విభాగం) ఆధ్వర్యంలో గ్రేటర్‌లోని కాలనీలతోపాటు.. శివార్లలో అర్బన్‌ పార్కుల అభివృద్ధికి అటవీశాఖతో కలిసి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. పట్నంలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందించడం లక్ష్యంగా ప్రత్యేక మొక్కలు నాటి ప్రాణ వాయు పార్కులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గాజులరామారంలోని 60 ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో సందర్శకులను అలరించేలా, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందించేలా, పర్యాటకులను ఆకర్షించేలా బహుళ ప్రయోజనకరంగా అభివృద్ధి చేసిన ప్రాణవాయువు పార్కును ఇటీవల ప్రారంభించారు. 


ఆహ్లాదం.. ఆనందం..

నగరం చుట్టూ ఉన్న గాజుల రామారం, సూరారం, బౌరంపేట ప్రాంతాల పరిధిలో 454 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం ఉంది. ఈ ఫారె్‌స్టలోని 60 ఎకరాల స్థలంలో విభిన్న రకాల మొక్కలు, సందర్శకులను ఆకర్షించే ఏర్పాట్లతో ప్రాణవాయు అర్బన్‌ పార్కును అభివృద్ధి చేశారు. పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఈ పార్కుల్లో నాలుగు నుంచి ఐదు సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఆకట్టుకునే పచ్చందాలు, వేడి నుంచి ఉపశమనంగా పార్కులో ఆహ్లాదంగా గడపవచ్చని అధికారులు చెబుతున్నారు. నగరానికి ఆనుకొని ఉన్న ఈ పార్కు ఇటీవల అందుబాటులోకి రాగా.. వారాంతాల్లో సిటీజనులు వందల సంఖ్యలో వస్తున్నారు. పర్యాటకుల కోసం వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లు, యోగా షెడ్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, రెండు ఓపెన్‌ క్లాస్‌ రూంలు, పిక్నిక్‌ ఏరియా ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు పార్కు ప్రత్యేకతను వివరించేలా ఓపెన్‌ క్లాస్‌ రూంలు ఉపకరిస్తాయని ఓ అధికారి తెలిపారు. పచ్చని చెట్ల మధ్య జాగింగ్‌, వాకింగ్‌, యోగా చేయడం భిన్న అనుభూతి కలిగించనుంది. బీఎన్‌రెడ్డి నగర్‌, జీడిమెట్ల వైపు ఉన్న ఫారెస్ట్‌ ఏరియాల్లోనూ అర్బన్‌ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నారు. 


ఆరోగ్యం.. అంతకుమించి..

మారుతోన్న జీవన విధానం, వైర్‌సల వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ నగరంలో అర్బన్‌ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదెకరాలకుపైగా విస్తీర్ణంలో 19 థీమ్‌ పార్కులు అభివృద్ధి చేశారు. మరో 17 చోట్ల పార్కుల అభివృద్ధి పురోగతిలో ఉందని జీవవైవిధ్య విభాగం వర్గాలు పేర్కొన్నాయి. చిన్నారులు, పెద్దలను ఆకర్షించేలా విభిన్న థీమ్‌లతో ఈ పార్కులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పిల్లల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేస్తుండగా.. పెద్దల కోసం వాకింగ్‌ ట్రాక్‌లు, పంచతత్వ పార్కు, యోగా చేసుకునేందుకు వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎకరం, రెండెకరాల స్థలంలో మరో 56 థీమ్‌ పార్కుల అభివృద్ధిని ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-01-30T16:06:07+05:30 IST