ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలవరం..!
ABN , First Publish Date - 2022-01-18T16:47:10+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలవరం మొదలయింది. బాలాపూర్ మండల పరిధిలోని మీర్‌పేట్ పీఎ్‌సతో పాటు బడంగ్‌పేట్ కార్పొరేషన్ కార్యాలయం, బాలాపూర్ పీహెచ్‌సీలో కరోనా

మీర్‌పేట్ పీఎస్‌లో పది మందికి పాజిటివ్
బడంగ్‌పేట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒకరికి
బాలాపూర్ పీహెచ్‌సీలో మరొకరికి కరోనా నిర్ధారణ
హైదరాబాద్/సరూర్‌నగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలవరం మొదలయింది. బాలాపూర్ మండల పరిధిలోని మీర్‌పేట్ పీఎ్‌సతో పాటు బడంగ్‌పేట్ కార్పొరేషన్ కార్యాలయం, బాలాపూర్ పీహెచ్‌సీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మిగతా వారిని కరోనా భయం వెంటాడుతోంది. ఎస్సై సహా పది మందికి మీర్‌పేట్ పోలీసు స్టేషన్‌లో వారం రోజుల వ్యవధిలో ఏకంగా పది మంది కరోనా బారిన పడడం గమనార్హం! వారిలో ఒకరు ఎస్సై కాగా ఏడుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. పీఎ్‌సలో కరోనా కేసులు పెరగడంతో ఇన్‌స్పెక్టర్ మద్ది మహేందర్‌రెడ్డి ముందు జాగ్రత చర్యలు చేపట్టారు.
పీఎ్‌సలోకి జనం గుంపులుగా రాకుండా ఉండేందుకుగాను ప్రవేశ మార్గంలోని రోడ్డుపై బ్యారికేడ్లు ఏర్పాటు చేయించారు. ఇక ఫిర్యాదుదారులు, బాధితుల కోసం ఆవరణలోని చెట్ల కింద ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయించారు. ఒక ఫిర్యాదు బాక్సును సైతం ఏర్పాటు చేయించి, ఎవరైనా తమ ఫిర్యాదులను అందులో వేసి వెళ్తే తాము విచారణ జరుపుతామని పేర్కొంటున్నారు. ముఖ్యమైన(ఎక్కువ మంది ప్రమేయం ఉన్న) కేసులు ఉంటే తమ ఎస్సైలను, సిబ్బందిని అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలతో సంఘటనా స్థలానికే పంపిస్తున్నట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రజలు తమకు సహకరించాలని ఆయన కోరారు.
బడంగ్‌పేట్ అకౌంట్ విభాగంలో ఒకరికి..
బడంగ్‌పేట్ కార్పొరేషన్ కార్యాలయంలోని అక్కౌంట్ విభాగంలోని ఓ మహిళా ఉద్యోగి కరోనా బారిన పడ్డారు. దాంతో ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇదే కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో ముగ్గురు సిబ్బంది అస్వస్థతకు గురై కార్యాలయానికి రావడం లేదు. వారికి పాజిటివ్‌గా నిర్ధారణ కాకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఉంటున్నారని మునిసిపల్ కమిషనర్ టి.కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. కార్యాలయంలో శానిటైజర్ అందుబాటులో ఉంచామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప కార్యాలయానికి రావొద్దని ఆయన సూచించారు.
పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంకు పాజిటివ్..
బాలాపూర్ పీహెచ్‌సీ పరిధిలోని ఒక సబ్ సెంటర్‌లో పని చేసే ఏఎన్‌ఎంకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆమె హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. జోనల్ బదిలీల్లో భాగంగా ఇటీవలె ఆమె ఇక్కడ విధుల్లో చేరినట్టు సమాచారం. కాగా తమ ఉద్యోగులు, సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని, తమ సిబ్బంది బాగుంటేనే ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతామని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రవి చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి అటెండెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.