పోలీసుల ఉరుకులు.. పరుగులు

ABN , First Publish Date - 2022-07-18T06:09:00+05:30 IST

పోలీసుల ఉరుకులు.. పరుగులు

పోలీసుల ఉరుకులు.. పరుగులు

20 మంది పోలీసులు 7 గంటల పాటు..

కాల్పులు కట్టుకథ అని తేలిన వైనం

జార్ఖండ్‌ డ్రైవర్‌ పొరపాటుకు హైరానా


హైదరాబాద్‌ సిటీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఓఆర్‌ఆర్‌పై తుక్కుగూడ వద్ద లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపినట్లు డయల్‌-100కు వచ్చిన ఫోన్‌ కాల్‌ రాచకొండ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం ఏసీపీలు, పహాడీషరీఫ్‌, ఆదిబట్ల లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు, ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ, శంషాబాద్‌ సహా.. 20 మందికి పైగా పోలీసులు ఏడు గంటల పాటు నిందితుల కోసం గాలించారు. 285 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు. చివరకు డ్రైవర్‌ కాల్పులు జరిగాయని చెప్పడం అబద్దం అని తేల్చారు. తుక్కుగూడ వద్ద ఉన్న ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌-14 వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి తనపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు జార్ఖండ్‌కు చెందిన డ్రైవర్‌ మనోజ్‌ యాదవ్‌ శనివారం రాత్రి డయల్‌-100కు ఫోన్‌ చేశాడు. దీంతో పోలీసులు బృందాల వారీగా రంగంలోకి దిగారు. లారీ చందాపూర్‌ నుంచి వయా ఓఆర్‌ఆర్‌ మీదుగా కేరళ రాష్ట్రం కొచ్చి వెళ్తున్నట్లు తెలుసుకుని అన్ని ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. విచారణలో ఎక్కడా లారీ ఆగిన దాఖలాలు గానీ, వేరే కారు లారీని ఫాలో అయినట్లుగానీ, అడ్డం వచ్చి కాల్పులు జరిపినట్లు గానీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాలేదు. దీంతో లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అద్దం పగిలినందుకు.. సైబరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన శంషాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. రెండు లారీలు ఐరన్‌ లోడ్‌

తో ఓఆర్‌ఆర్‌పై వెళ్తుండగా.. పక్క  పక్కనే వెళ్లే వేగానికో, మరేదో కారణంతోనో మనోజ్‌కుమార్‌ నడుపుతున్న లారీ ముందు అద్దం పగిలిపోయింది. దాంతో డ్రైవర్లు లారీలను పక్కకు ఆపారు. ఎవరో దుండగులు లారీని వెంబడించి కాల్పులు జరిపి పారిపోయి ఉంటారని  అపోహపడి  డ్రైవర్‌ డయల్‌-100కు ఫోన్‌ చేశారు. లారీ అద్దం పగిలిపోవడంతో ఓనర్‌ జీతంలో కట్‌ చేస్తాడని భయపడి ఎవరో కాల్పులు జరిపినట్లు డ్రైవర్‌ సృష్టించి ఉంటాడని ముందుగా పోలీసులు అనుమానించారు. నిజంగానే కాల్పులు జరిగి ఉంటాయన్న అపోహతోనే పోలీసులకు ఫోన్‌ చేసినట్లు నిర్ధారించుకుని డ్రైవర్లు మనోజ్‌కుమార్‌ యాదవ్‌, మంటు కుమార్‌ సునిత్‌ కుశ్వాతాలను పోలీసులు వదిలేశారు. 


Read more